జనహృదయ దర్శనం

5 Nov, 2017 01:16 IST|Sakshi

♦ త్రికాలమ్‌
తమ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి యోగక్షేమాలు విచారించిన నాయకులను ప్రజలు అక్కున చేర్చుకుంటారు. పాదయాత్ర వల్ల లభించిన అనుభవాన్నీ, క్షేత్రజ్ఞానాన్నీ, అధికారాన్నీ ఏ విధంగా సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేస్తారనే విషయం ఆయా రాజకీయ నాయకుల సంస్కారంపైన ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రసాదించిన నిచ్చెన ఎక్కి అందలంపైన కూర్చోగానే అదే నిచ్చెనను తన్ని తగలేయడం, నిరంకుశంగా, నిర్దయగా వ్యవహరించడం చూస్తున్నాం. నిజంతో నిమిత్తం లేకుండా అసత్య ప్రచారంతో, దబాయింపు రాజకీయంతో వర్థిల్లుతున్నవారినీ, ఎన్నికల వాగ్దానాలను అటకెక్కించి సొంత ఎజెండాను పట్టాలపై ఎక్కించినవారినీ ప్రజలు గమనిస్తున్నారు. అటువంటి ప్రభుత్వాలపైనా, ప్రభువులపైనా ప్రజలకు షికాయతులు ఉంటాయి.

ప్రధానమంత్రులూ, ముఖ్యమంత్రులూ పాదయాత్రలు చేయలేరు. వారు పరి పాలనలో నిర్విరామంగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులకే ప్రజలతో వివరంగా సంభాషించే సావకాశం ఉంటుంది. చంద్రశేఖర్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడే పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడూ, వైఎస్‌ఆర్‌సీపీ అధినేతా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు ఉదయం ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. షర్మిల 2012లో ఎక్కడి నుంచి నడక ప్రారంభించారో అక్కడి నుంచే అన్న పాదయాత్ర మొదలుపెడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు అధికారంలో ఉండటం చూస్తున్నాం కానీ ప్రజలను కలుసుకునేందుకు ముగ్గురు కుటుంబ సభ్యులు వేల కిలోమీటర్లు నడవడం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళడం, కష్టసుఖాలు తెలుసుకోవడం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం అన్నది అత్యంత ఉత్కృష్టమైన రాజకీయం.

పాదయాత్రల ప్రశస్తి
భారతీయ సంస్కృతిలో పాదయాత్రకు విశిష్టమైన స్థానం ఉంది. బుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరుడు వంటి మహానుభావులు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ పాదయాత్ర చేసి తమ భావజాలాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేశారు. పాదయాత్రలో ప్రధాన లక్ష్యాలు నాలుగు. 1) ప్రజల మనసుల్లో ఏమున్నదో తెలుసుకోవడం 2) క్షేత్ర వాస్తవికతను గమనించడం 3) నడిచే నాయకుడి శారీరక, మానసిక దారుఢ్యాన్ని పరీక్షించుకోవడం 4) మీడియా ప్రాథ మ్యాలతో నిమిత్తం లేకుండా ప్రజలకు అర్థం కావడం, ప్రజలను అర్థం చేసుకోవడం. అహింసాత్మకంగా నిరసన ప్రకటించడం కూడా పాదయాత్ర లక్ష్యాలలో ఒకటి. సత్యాగ్రహ ప్రయోగాలను గాంధీ దక్షిణాఫ్రికాలో 1906లోనే ప్రారంభిం చారు.

అక్కడి ప్రభుత్వం ఆయన కదలికలపై ఆంక్షలు విధించలేదు. 1930లో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ 388 కిలోమీటర్లు నడిచి సముద్రపు ఒడ్డున దండికి చేరి వలస ప్రభుత్వాన్ని ధిక్కరించారు. కొమ్మారెడ్డి సత్యనారాయణ ఇచ్ఛాపురం నుంచి చెన్నై వరకు రైతుయాత్రకు నాయకత్వం వహించారు. 1935–36లో జరిగిన ఈ బృహత్తర యాత్రను కర్షక నాయకుడు ఆచార్య రంగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వలస ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు. భూదానోద్యమంలో భాగంగా వినోబాభావే తెలంగాణ నుంచి 1951లో ఆరంభించి బుద్ధగయ వరకూ నడిచారు. 1980–81లో డిఎంకె నాయకుడు కరుణానిధి ‘నీదికేట్టు నెడుంపయనం’(న్యాయంకోసం సుదీర్ఘ పాదయాత్ర)పేరుతో ఎంజీఆర్‌ సర్కార్‌ పట్ల వ్యతిరేకత ప్రకటిస్తూ చాలా దూరం నడిచారు. జనతాపార్టీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కన్యాకుమారి నుంచి ఢిల్లీలో గాంధీజీ సమాధి వరకూ ఆరు మాసాలపాటు 4,260 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర సాగిం చారు. 1983 జనవరి 6న ప్రారంభమైన యాత్ర జూన్‌ 25న ముగిసింది. భారత్‌యాత్రలో భాగంగా ఆయన విజయవాడ వచ్చినప్పుడు నేను ‘ఆంధ్రప్రభ’ కోసం ఆయనను ఇంటర్వ్యూ చేశాను. పాదయాత్ర తర్వాత ఏడేళ్లకు చంద్రశేఖర్‌ దేశానికి ఎనిమిదవ ప్రధాని అయ్యారు. ఆ పదవిలో ఏడుమాసాలే (నవంబరు 10, 1990 నుంచి 21 జూన్‌ 1991 వరకు)ఉన్నారు. అది వేరే విషయం.

వైఎస్, బాబు, షర్మిల
2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ 1500 కిలోమీటర్లు 68 రోజుల్లో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. పాదయాత్రలో అపశ్రుతులు లేవు. ప్రజాసంక్షేమానికి అంకితమైన నేతగా, ప్రజలపట్ల అపారమైన ప్రేమ కలిగిన నాయకుడిగా ఆయన ప్రజలకు అర్థమైనారు. 2004 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. 2012–13లో నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అక్టోబర్‌ 2న బయలుదేరి 2,340 కిలోమీటర్లు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో 117 రోజులు నడిచారు. నడక మొదలు పెట్టే ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ‘సంక్షోభంలో విలవిలలాడుతున్న ప్రజలను కలుసుకోవడం నా బా«ధ్యత. రాష్ట్రంలో పరిపాలనంటూ బొత్తిగా లేదు. నిరంతరం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో, విద్యుచ్ఛక్తి కోతలతో, కరువుతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొని వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాను’ అన్నారు. ఇవే మాటలు కొద్ది మార్పులతో నేటి ప్రతిపక్ష నాయకుడికీ వర్తిస్తాయన్న విషయం చంద్రబాబు విస్మరిస్తున్నారు.

నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా యాత్రలో ఆయనను నిలదీసేందుకు ప్రయత్నించిన లగడపాటి రాజగోపాల్‌ బృందాన్ని అరెస్టు చేయించారు. 2013 ఆగస్టు 28న యాత్ర ముగిసే వరకూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు. దాదాపు అదే సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల అసాధారణమైన పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. 2012 అక్టోబర్‌ 18న ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి దగ్గర ప్రారంభమైన యాత్ర 14 జిల్లాలు, 107 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగింది. ‘జగనన్న విడిచిన బాణాన్ని’ అంటూ ఆమె సాగించిన యాత్ర సంచలనాత్మకమైనది. ఒక మహిళ 3,112 కిలోమీటర్ల దూరం 230 రోజులు నడవడం తిరుగులేని రికార్డు. తొలి అంకంలోనే ఆమె 250 కిలోమీటర్ల నడక పూర్తి చేసిన రోజు (2012 నవంబర్‌ 12) అప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలో ఉండిన వరిష్ఠ నాయకుడు మైసూరారెడ్డి షర్మిలకు కితాబు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌ నేత మమతాబెనర్జీ ‘మా, మాతి, మనీష’ (మాతృమూర్తి, మాతృభూమి, ప్రజలు) అనే నినాదంతో 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, 2011 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పాదయాత్ర చేశారు. ఆమె రికార్డును అధిగమించి షర్మిల చరిత్రను తిరగరాశారని ఆయన అభినందించారు. యాత్రలో ఆమె మోకాలికి గాయం కావడం మినహా ఎటువంటి అవాంఛనీయ ఘటనా ఎదురు కాలేదు. 

ఈ మధ్య స్వల్పకాలిక పాదయాత్రలు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో రైతుల సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో నెలరోజులపాటు మహాపాదయాత్ర చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కేరళలో బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తల హత్యల పట్ల నిరసన ప్రకటించేందుకు కణ్ణూర్‌లో నడిచారు. వామపక్ష సంఘటన ప్రభుత్వం ఆయనను రాజకీయంగా విమర్శించిందే కానీ ఎటువంటి ఆటంకాలూ కల్పించలేదు. ఇటీవల మార్క్సిస్టు పార్టీ నాయకుడు తమ్మినేని వీరభద్రం తెలంగాణలో మహాజన పాదయాత్ర జరిపి 2,150 కిలోమీటర్ల దూరం 82 రోజులలో నడిచారు. 

తుని ఆరోపణ వెనుక వ్యూహం
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అనేక విడతల ‘చలో అమరావతి’ పిలుపునిచ్చి ఇంటి నుంచి పది గజాలు కూడా పోలీసు వలయంలో నడవలేకపోయారు. వర్షించని మేఘంలాగా, నడవని పథికుడిగా మిగిలిపోయారు. ప్రభుత్వంపైన నిరసన ప్రకటించేందుకు అదే ప్రభుత్వం అనుమతి కావాలనడం నిస్సందేహంగా అప్రజాస్వామికం, నిరంకుశం. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేయాలన్న ప్రతిపాదన వచ్చిన వెంటనే ప్రభుత్వ అనుమతి తీసుకోవలసిన ఆవశ్యకత గురించి ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి చినరాజప్ప సూక్తులు చెప్పారు. డీజీపీ సాంబశివరావు ఉద్ఘోషలు సరేసరి. తుని వంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉన్నదంటూ పార్టీ నాయకులను చంద్రబాబు హెచ్చరించడం వెనుక మైండ్‌గేమ్‌ ఉంది.

చేయని నేరం చేసినట్టు పదేపదే మాట్లాడటం, ప్రచురించడం, ప్రచారం చేయడం వెనక బాబుకొక వ్యూహం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తోంది. తునిలో రైలు దగ్ధం అవుతున్న సమయంలోనే మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళాన్ని పంపకుండా మీడియా గోష్ఠి పెట్టి రాయలసీమ రౌడీలు ఆ పని చేశారంటూ చంద్రబాబు నిందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా నేరం జరిగిన క్షణాలలోనే నిందారోపణ చేయలేదు. ఆ కేసు నిందితులుగా గోదావరి జిల్లాల కాపులను చూపారు తప్ప అందులో రాయలసీమవారు ఎవ్వరూ లేరు. తుని వంటి ఘటన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడి పాదయాత్రలో జరిగే అవకాశం ఉన్నదని మాట్లాడటం ద్వారా తుని రైలు దగ్థం వెనుక వైఎస్‌ఆర్‌సీపీ ఉన్నదనే ఆరోపణ అన్యాపదేశంగా చేస్తున్నారు. ఇందులో వీసమెత్తు నిజం లేదని చంద్రబాబుకు తెలుసు. పోలీసులు నేరస్థులు ఎవరో గుర్తించి నిర్ధారించినప్పటికీ ఆ విషయం వెల్లడించరు. ఎందుకంటే, నేరస్తులు ఎవరో తెలిస్తే జగన్‌మోహన్‌రెడ్డిపైన విమర్శ చేయడానికి ఆస్కారం ఉండదు. ఆత్మస్తుతి, పరనిందకు అవధులు దాటడం ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకూ స్వోత్కర్ష ఉండేది కానీ ఇంత ఎబ్బెట్టుగా కాదు. వయస్సు ప్రభావం కావచ్చు. 

ఇవీ నేటి రాజకీయ విలువలు 
సోనియాగాంధీతో విభేదించి కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించారన్న ఏకైక కారణంతో జగన్‌మోహన్‌రెడ్డిపైన సీబీఐ పెట్టిన కేసులలో ఒక్కటీ కొలిక్కి రాలేదు. ఒక్క ఆరోపణా రుజువు కాలేదు. రుజువు కాదనే న్యాయశాస్త్రంలో తలపండినవారి అభిప్రాయం. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. తనతో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన ఎంఎల్‌ఏలు అందరి చేతా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇటీవల నంద్యాల ఉపఎన్నిక సందర్భంలో సైతం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలోకి మారాలని అనుకున్నప్పుడు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని షరతు పెట్టారు. కొన్ని మాసాల కిందటే సర్వ శక్తులూ వినియోగించి గెలుచుకున్న సభ్యత్వాన్ని పరిత్యజించి చక్రపాణి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

ఈ రాజ్యాంగబద్ధమైన, విలువలతో కూడిన రాజకీయాన్ని మీడియా పెద్దలు కానీ, మేధావులు కానీ తగినంతగా గుర్తించలేదు. ఆరోపణలపైన విచారణ కూడా ప్రారంభం కాకుండా 16 మాసాలు జైలు జీవితం గడిపినప్పటికీ గుండె దిటవు చెదరకుండా 2014 ఎన్నికలలో పోరాడి కేవలం 1.83 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజానాయకుడుగా కాకుండా వేరే తీరున చిత్రించడానికి చంద్రబాబూ, ఆయన మిత్రులూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన 21 మంది ఎంఎల్‌ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, వారి చేత రాజీనామాలు చేయించ కుండా, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన అనైతిక రాజకీయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించవు.

ఎన్నికల కమిషన్‌ ఆక్షేపించదు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న రాజకీయ విలువలకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. కల్లబొల్లి మాటలతో కొందరిని కొంతకాలం నమ్మించవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం నమ్మించజాలరు. ప్రజాస్వామ్యవాదులకు అదే భరోసా. జగన్‌మోహన్‌రెడ్డి తల పెట్టిన ఈ సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్ర అయిదున్నర కోట్ల జనహృదయాలను స్పృశిస్తూ నిర్విఘ్నంగా సాగిపోవాలని, వారి ఆవేదనలనూ, ఆకాంక్షలనూ బలంగా వినిపించాలని, రాష్ట్ర రాజకీయాలకు ఇదొక మేలి మలుపు కావాలని ఆశిద్దాం.


కె. రామచంద్రమూర్తి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా