విశ్వవిద్యాలయాల నోరునొక్కితే.. దేశానికే నష్టం

4 Nov, 2018 01:04 IST|Sakshi

విశ్లేషణ

సమాజంలో జటిలమౌతున్న  సామాజిక సమస్యల తీవ్రతకు పరిష్కారాలని చూపగలిగే పరిశోధనలు జరుగుతున్నాయా? జరిగితే ఎక్కడ జరగాలి? మన విశ్వవిద్యాలయాల్లోనే అది సాధ్యం. సమాజంలో వచ్చే మార్పులని గమనించి వాటి తీవ్రతని అంచనా వేసే శక్తి సామాజిక శాస్త్రాలకు మాత్రమే ఉన్నది. ఈ సామాజిక శాస్త్ర పరిశోధన ముందుకు తెచ్చే సమస్యలకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలు పరిష్కారాలను చూపే ప్రయత్నం చెయ్యాలి. కానీ మన దేశంలో సామాజిక శాస్త్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. యూనివర్సిటీల్లో సామాజిక శాస్త్రాలకు ప్రోత్సాహం లభించటంలేదు. అసలు పరిశోధన వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసమా? లేక ప్రజాప్రయోజనార్థం జరగాలా? అనే అంశంపై చర్చ జరగాలి.

మానవ నాగరికతా పరిణామంలో గత శతాబ్దకాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. విద్యవైజ్ఞానిక రంగాల్లో జరిగిన  అభి వృద్ధీ, పెరిగిన శాస్త్రీయ ఆలోచనలూ, సామాజిక చైతన్యం వెరసి అసాధ్యమనుకున్నవెన్నో సుసాధ్యమవుతున్నాయి. మానవ వనరుల అభివృద్ధితో పాటు మనిషి సగటు ఆయుర్దాయం పెరిగింది. స్త్రీలకు విద్యావకాశాలు పెరిగాయి. ప్రాథమిక విద్య అయినా కనీసం అందరికీ అందుబాటులోకి వచ్చింది. తలసరి ఆదాయంలో గణనీయమైన అభివృద్ధి కనపడు తోంది. పట్టణీకరణ, ఉపాధి అవకాశాల మెరుగు ప్రజలను సాంకేతికత దరికి చేర్చింది. దాదాపు 50 శాతం మంది జనం మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నారు. ఖండాంతరాల్లో ఉపాధి అవకాశాలు రావడంతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. సుదూర తీరాలకు మన యువతరం ఎగిరిపోతోంది. అయితే ఇదంతా నాణే నికి ఒకవైపు మాత్రమే. సంపద, విజ్ఞానం, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నా మరోవైపు నిశితంగా పరిశీలిస్తే విషాదకరమైన పరిస్థితి గోచరిస్తోంది. పైకి అభివృద్ధి కనిపిస్తోన్నా లోపల అంధ కారం గోచరిస్తోంది. ప్రపంచ జనాభాలో 120 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. కొద్దో గొప్పో బాగా ఉంటాయనుకున్న బ్యాంకాక్, మలే íసియా రాజధాని కౌలాలంపూర్‌లలో సైతం పేద కుటుంబాల్లో పిల్లలకు మంచి ఆహారాన్ని కొనుక్కో లేని స్థితిలో ఉన్నారు.  

బ్యాంకాక్‌లో మూడోవంతుకుపైగా చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నట్టు 2017 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్‌లోనైతే దేశం మొత్తంలో కేవలం నాలుగు శాతం మంది పిల్లలు మాత్రమే కనీస ఆహారాన్ని పొందగలుగుతున్నట్టు అక్కడి ప్రభుత్వమే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కల్లా ఆకలిని జయించాలంటే, పౌష్టికాహార లోపాలన్ని అధిగమించాలంటే ఈ రీజన్‌లో ప్రతి రోజూ 1,10,000 మంది ప్రజలకు సరైన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. కనీస పారిశుద్ధ్య వసతు ల్లేక, ఆహార భద్రతకరువై 79 మిలియన్ల మంది ఐదేళ్ళలోపు చిన్నారులు ఈ రీజన్‌లో వయస్సుకు తగిన ఎదుగుదల లేక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన దేశంలోని ఐదేళ్ళలోపు చిన్నారుల్లో 38 శాతం మందికి వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. 21 శాతం మంది ఐదేళ్ళలోపు చిన్నారులు వయసుకి తగ్గ బరువు తూగడంలేదు.
 
మనదేశంలో స్త్రీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. తాజా గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్టు 2017 జాబితాలో భారతదేశం అట్టడుగు భాగంలో ఉంది. భారత్‌లో 51 శాతం మంది సంతానోత్పత్తి దశలో రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే ప్రతి ఐదుగురిలో ఒకరికంటే ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. రక్తహీనత విషయంలో మన తరువాతి స్థానాలు చైనా, పాకిస్తాన్, నైజీరియా, ఇండోనేíసియాలు ఆక్రమించాయి.  2016 గణాంకాల ప్రకారం మన దేశంలోని స్త్రీలలో 46 శాతం మందిని రక్తహీనత బాధిస్తోంది. కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదు. పారిశుద్ధ్య లోపంతో అనారోగ్య, స్త్రీల సామాజిక సమస్యలకు కారణమవుతోంది.  

ఇక విద్య సంగతి చెప్పక్కర్లేదు. కనీస జీవన అవసరాలను తీర్చుకోగలిగేపాటి నైపుణ్యం కూడా విద్యార్థులకు ఈ చదువు అందించలేకపోతోంది. ఆకలి, ఆత్మహత్యల నివారణకు చర్యలు మృగ్యమ య్యాయి. అమెరికాలాంటి సంపన్నదేశాల్లో సైతం దారిద్య్రం తొంగిచూస్తోంది. యూరప్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. సమాజంలో జటిలమౌతున్న ఈ సామాజిక సమస్యల తీవ్రతకు పరిష్కారాలని చూపగలిగే పరిశోధనలు జరుగుతున్నాయా? జరిగితే ఎక్కడ జరగాలి? అంటే మన విశ్వవిద్యాలయాల్లోనే అది సాధ్యం. సమాజంలో వచ్చే మార్పు లని గమనించి వాటి తీవ్రతని అంచనా వేసే శక్తి సామాజిక శాస్త్రాలకు మాత్రమే ఉన్నది. ఈ సామా జిక శాస్త్ర పరిశోధన ముందుకు తెచ్చే సమస్యలకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలు పరిష్కారాలను చూపే ప్రయత్నం చెయ్యాలి. కానీ మన దేశంలో సామాజిక శాస్త్రాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. యూనివర్సిటీల్లో సైన్స్‌ మరియు టెక్నాలజీలకు ఇచ్చే ప్రోత్సాహం సామాజిక శాస్త్రాలకు లభించటంలేదు. అసలు పరిశోధన వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసమా? లేక ప్రజాప్రయోజనార్థం జరగాలా? అనే అంశంపై చర్చ జరగాల్సి వుంది. విదేశాల్లో వ్యాపార సంస్థల పరిశోధనా ఖర్చును సదరు సంస్థలే చూసుకుంటుంటే మన దేశంలో మాత్రం ప్రజాధనంతో పరిశోధన జరిపే విధానం చోటు చేసుకుంది.  

దేశంలో సామాజిక శాస్త్రాల్లో ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసిన జెఎన్‌యు లాంటి యూనివర్సిటీని ధ్వంసం చేసుకుంటున్నాం. ప్రతి రోజూ దానిని వివాదాస్పద అంశాలకు కేంద్ర బిందువుని చేసి అక్కడ స్వేచ్ఛగా జరగాల్సిన మేథోమథనాన్ని ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాం. కేంద్ర యూనివర్సిటీల్లో ప్రభుత్వ జోక్యం పెచ్చుమీరిపోయింది. దళిత బడుగువర్గాల పిల్లలు ఇప్పుడిప్పుడే వాటి గడప తొక్కుతుంటే వారికి అంతరాయం కల్పించే పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. పరిశోధక విద్యార్థులకి అందే ఉపకార వేతనాలు కత్తిరించివేస్తున్నారు. ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌ లాంటి వారు సామాజిక శాస్త్రాల వృద్ధి కోసం నలందా యూనివర్సిటీని ఒక నమూనాగా ముందుకు తీసుకురాగా దానికి ఆదిలోనే గండి కొట్టారు. ఈ దేశంలో యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ తన పాత్రని ప్రతిభావంతంగా పోషించింది. దాని ఏర్పాటు కోసం తయారుచేయబడిన నియమాలు ప్రైవేటు యూనివర్సిటీల ప్రోత్సాహానికి ఆటంకంగా మారాయని, దానిని రద్దు చేసి ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేశారు. పరిశోధనలు వాటి విచక్షణ మేరకుగాక మార్కెట్‌ ప్రయోజనాల కోసం జరిగితే ప్రమాదం మరింత పెరుగు తుంది. వీటిల్లో అధ్యాపకుల నియామకాల్లో కూడా రిజర్వేషన్‌ అమలు నీరుగారిపోయే ప్రమాదముంది.

విశ్వవిద్యాలయాలు సమాజపు ఉమ్మడి మెదడు లాంటివి. సామాజిక శాస్త్రాలు ఉమ్మడి మేధ స్సులాంటిది. ఇలాంటి విశ్వవిద్యాలయాలను ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు ఈ దేశానికి ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడతాయి. సామాజిక శాస్త్రాల మూలాలను తొలగించడం అంటే సమాజంలో అశాంతిని పెంచి పోషించడమే. దేశంలో అశాంతి పెరిగితే ఈ దేశాన్ని గ్లోబల్‌ పవర్‌గా తయారు చేయలేకపోగా, ఇప్పటికే సాధించిన ఈ మాత్రం అభివృద్ధినీ వెనక్కి తీసుకెళ్ళడానికి ఎంతో కాలం పట్టదు.

వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,
మాజీ ఎమ్మెల్సీ
చుక్కా రామయ్య

మరిన్ని వార్తలు