‘డబుల్’కు అంత రుణం ఎలా తెస్తారు?

22 Mar, 2016 00:41 IST|Sakshi

పద్దులపై చర్చలో కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి
♦ మైనార్టీ పద్దుల్లో వివరాల్లేకపోవడంపై అక్బర్ ఫైర్
♦ బీసీలను రెంట్టింపు కేటాయింపులు చేయాలి: ఆర్.కృష్ణయ్య
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకుంటామని చెబుతున్న సర్కారు మాటలకు, వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. 2.60 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది దాదాపు రూ.16,123 కోట్లు కావాలని, అంత మొత్తం రుణంగా ఇచ్చే పరిస్థితి హడ్కోకు లేదన్నారు. దేశ ంలో అన్ని రాష్ట్రాలకు హౌసింగ్ కోసం హడ్కో 2014-15లో రూ.3వేల కోట్లు, 2015-16లో 4,366 కోట్లు ఇచ్చిందన్నారు. అలాంటప్పుడు ఒక్క తెలంగాణకే రూ.16 వేల కోట్లు ఎలా ఇస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పద్దులపై చర్చను ప్రారంభించారు. ఇందిరమ్మ బిల్లుల కోసం 4.15 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బడ్జెట్‌లో అమరుల కుటుం బాల సంక్షేమం ప్రస్తావనే లేదన్నారు.

 అక్బరుద్దీన్ ఆగ్రహం.. సర్దిచెప్పిన సీఎం
 మైనార్టీ సంక్షేమానికి సంబంధించి అధికారులు ఇచ్చిన పుస్తకంలో ఈ ఏడాది లక్ష్యాలు, విడులైన నిధులు, పెండింగ్ వివరాలు పూర్తిస్థాయిలో పేర్కొనక పోవడంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం స్వయంగా నిర్వహిస్తున్న శాఖలోనే ఇలాంటి పరిస్థితి ఉండడమేంటని ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ కలుగజేసుకొని.. సిబ్బంది కొరత కారణంగా వివరాలు సకాలంలో ఇవ్వలేకపోయారని, త్వరలోనే  పూర్తి సమాచారం పంపుతామని సర్దిచెప్పారు.

 బీసీలకు నిధులేవీ?:వంశీచందర్ రెడ్డి
 జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో రూ.2500 కోట్లే కేటాయించడం వారిని అవమానించడమేనని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. కేటాయింపులను రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వినియోగించాల్సిన13,136 కోట్లలో గతేడాది  7,314 కోట్లే ఖర్చు చేయడం రాజ్యాం గాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

 ఫీజులకు కేటాయింపులేవీ: పాయం  
 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి గతేడాది బకాయిలు రూ.800 కోట్లు ఉండగా.. ప్రస్తుత ఏడాది రూ.2,600 కోట్లు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పాత బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోగా, వచ్చే ఏడాది చెల్లింపులకు కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

 దళితులకిచ్చిన హామీలేమయ్యాయి?: సున్నం రాజయ్య
 కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.లక్ష నగదు, ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడం లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. దళితులు మూడెకరాల భూమి పథకం కింద 10 లక్షల ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటివరకు 3,640 ఎకరాలే పంపిణీ చేశారని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పేర్కొన్నారు.

 వచ్చే బడ్జెట్ నాటికి డబుల్ ఇళ్లు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
 2014-15 ఏడాదిలో మంజూరు చేసిన 60 వేల ఇళ్లతో పాటు ఈ ఏడాది మంజూరు చేసిన 2 లక్షల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను వచ్చే బడ్జెట్ నాటికి పూర్తిచేస్తాం. ఇందుకు బడ్జెట్‌లో  587 కోట్లు కేటాయించాం. హడ్కో నుంచి  13,351 కోట్ల అప్పుగా తెస్తాం. రూ.12,549 కోట్ల రుణానికి హడ్కో ఓకే చెప్పింది.

 ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి బాటలు:  మంత్రి చందూలాల్
 రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసింది. గతేడాదితో పోలిస్తే ఎస్సీ సంక్షేమానికి రూ.1,155 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.443 కోట్లు పెంచాం

 విదేశీ విద్యకు మరింత సాయం: మంత్రి జగదీశ్ రెడ్డి
 విదేశాల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.10 లక్షలనుమరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేప్ బాధితులకు అందజేస్తున్న పరి హారాన్నీ పెంచుతాం

 బీసీ సబ్‌ప్లాన్‌కు ప్లాన్: మంత్రి జోగు రామన్న
 బీసీ సబ్‌ప్లాన్‌కు పూర్తి సానుకూలంగా ఉన్నాం. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చడంపై అనంతరాం కమిటీ నివేదిక రావాల్సి ఉంది.

12శాతం రిజర్వేషన్లపై ఆలోచిస్తున్నాం
 ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై ఆలోచనలు చేస్తున్నాం. సుధీర్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే దీనిపై చర్యలుంటాయి.

 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మిస్తాం: తుమ్మల  
 ఇప్పటికే ఆరంభించిన 1,268 అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి చేయడంతో పాటు కొత్తగా  1,200 భవనాల నిర్మాణాలను చేపడతాం.

>
మరిన్ని వార్తలు