జీవో 123 కొట్టివేతపై నేడు అప్పీల్

5 Aug, 2016 00:49 IST|Sakshi
జీవో 123 కొట్టివేతపై నేడు అప్పీల్

సాక్షి, హైదరాబాద్: జీవో 123ని కొట్టేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ రూపంలో అప్పీల్‌ను దాఖలు చేయనుంది. ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇందుకు సంబంధించి ప్రస్తావన చేయనున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం స్వయంగా ఏజీతో మాట్లాడినట్లు సమాచారం.

ఈ అప్పీల్‌లో హాజరై వాదనలు వినిపించే బాధ్యతలను ఏజీకి అప్పగించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఏజీ.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, ఈ విషయంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తర్వులు, వాటి తీరు తెన్నులు తదితర అంశాలపై అధ్యయనం మొదలుపెట్టారు. భూములను అమ్మే, కొనే అధికారం ప్రభుత్వానికి ఉందన్న కోణంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిశీలించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములను ఎలా సేకరిస్తోంది.. దానిపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు.. వాటిపై ధర్మాసనం ఇచ్చిన తీర్పులు.. తదితర అంశాలపైనా ఏజీ బృందం దృష్టి సారించింది. ఇప్పటికే జీవో 123పై అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా అప్పీల్‌లో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. గురువారం సాయంత్రం వరకు జీవో కొట్టివేత తాలుకు తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో స్వయంగా ఏజీనే రంగంలోకి దిగారు. సాయంత్రం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ కోర్టుకు వెళ్లి.. తీర్పు కాపీ కోసం న్యాయమూర్తిని అభ్యర్థించారు.

విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశమని, అందువల్ల తీర్పు కాపీ వీలైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఏజీ స్వయంగా వచ్చి కోరడంతో సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. తన ఢిల్లీ విమాన ప్రయాణ సమయాన్ని కూడా మార్చుకున్నారు. బెంచ్ దిగిన తర్వాత  న్యాయమూర్తి.. తన తీర్పు కాపీలో ఏవైనా అక్షర దోషాలు ఉన్నాయో పరిశీలించి వాటిని సరిచేసే పని పూర్తిచేశారు. అనంతరం రిజిస్ట్రీలో తీర్పు కాపీ బయటకు వచ్చేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయి, ఏజీ చేతికి కాపీ వచ్చే సరికి రాత్రి 8.30 అయింది. అప్పటి వరకు రామకృష్ణారెడ్డి హైకోర్టులోనే ఉన్నారు. తీర్పు కాపీ తీసుకుని ఇంటికి వెళ్లారు.

>
మరిన్ని వార్తలు