నేటి నుంచి మెగా ఏవియేషన్ షో

16 Mar, 2016 03:59 IST|Sakshi
నేటి నుంచి మెగా ఏవియేషన్ షో

వేడుకలు ప్రారంభించనున్న రాష్ర్టపతి ప్రణబ్
 
సాక్షి, హైదరాబాద్: మెగా ఏవియేషన్ షో నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు (ఈ నెల 20 వరకు) బేగంపేట విమానాశ్రయంలో జరిగే ఈ వేడుకల ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరి 2.50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మూడు గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి ఏవియేషన్ షోను ప్రారంభించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

గవర్నర్ నరసింహన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్, ఆ శాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాస్తవ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హాజరవుతారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.10 గంటలకు రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకలను ఈసారి ‘ఇండియా సివిల్ ఏవియేషన్ రంగం, పొటెన్షియల్ యాజ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’ అనే అంశం ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. 19, 20 తేదీల్లో సామాన్య ప్రజలు వీక్షించేందుకు అనుమతిస్తారు. గేటు 1(ఫస్ట్‌ఫ్లోర్)-వీఐపీలు, గేటు 1ఏ చాలెట్ ఎగ్జిబిటర్లు, గేటు 2 (గ్రౌండ్‌ఫ్లోర్)-కాన్ఫరెన్స్ ఎంట్రీ, గేటు 3- ఎగ్జిబిటర్ ఎంట్రీ, గేటు 4-బిజినెస్ విజిటిర్ ఎంట్రీ, గేటు 5, 6 బయటకు , గేటు 7 సామాన్య ప్రజలకు ప్రవేశం (19, 20 తేదీల్లో) ప్రవేశం కల్పిస్తారు.
 
విమాన విన్యాసాల వేళలు
బుధవారం మధ్యాహ్నం 3.50 నుంచి 04.15 వరకు విన్యాసాలు జరుగుతాయి. 17, 18, 19, 20 తేదీల్లో ఉదయం 11.35-11.45, మధ్యాహ్నం 3 నుంచి 3.15 వరకు 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విమానాల విన్యాసాలు జరుగుతాయి. గ్లోబల్ ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువుదీరతాయి.

పలు దేశాల నుంచి ప్రతినిధుల హాజరు..
అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు గ్లోబల్ కంపెనీల సీఈఓలు, విమానయాన సంస్థలు, ఎమ్‌ఆర్‌వోలు, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, శిక్షణనిచ్చే సంస్థలు, ఇంజన్ తయారీ కంపెనీలు సీఎఫ్‌ఎం, యుటీసీ, జీఈలు, కార్గోలు ప్రదర్శనలో పాలుపంచుకుంటాయి. ఏ380, ఏ350, ఎయిర్‌బస్ 747,  ఎయిర్‌బస్ 800, బోయిం గ్, డసాల్ట్, గల్ఫ్ స్ట్రీం, టెక్స్‌ట్రోన్ విమానాలు, అగస్టా వెస్ట్‌లాండ్, బెల్, రష్యన్ హెలికాప్టర్లు ప్రదర్శనలో ఉంటాయి.  

వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు. కేంద్ర పౌర విమానయాన శాఖతో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ఈ ఉత్సవాల ను నిర్వహిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు