మహిళ మెడలోని మంగళసూత్రం స్నాచింగ్

24 Aug, 2015 00:05 IST|Sakshi
మహిళ మెడలోని మంగళసూత్రం స్నాచింగ్

రెండు ఠాణాల మధ్య  వివాదం పెట్టిన స్నాచర్లు
 
చాంద్రాయణగుట్ట: ఇద్దరు కుమారులతో కలిసి బైక్‌పై వెళుతున్న ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని గుర్తు తెలియని యువకులు తెంచుకొని ఉడాయించారు. చాంద్రాయణగుట్ట అదనపు ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ కథనం ప్రకారం.....శంషాబాద్ బహదూర్‌పురా గ్రామానికి చెందిన జగదాంబ(50) రక్షాపురానికి వచ్చింది. ఆదివారం ఉదయం 7.30కి తన ఇద్దరు కుమారులతో కలిసి బైక్‌పై బహదూర్‌పురా గ్రామానికి బయల్దేరారు. ఎర్రకుంటలోని  సీఆర్‌పీఎఫ్ శిక్షణ కేంద్రానికి వెళ్లగానే వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు జగదాంబ మెడలోని మూడు తులాల మంగళ సూత్రాన్ని తెంచుకొని ఉడాయించారు. బైక్‌పై నుంచి లాగడంతో కింద పడ్డ జగదాంబ స్వల్పగాయాలకు గురైంది. కాగా నిందితుడు వేసుకున్న టీ షర్ట్ వెనుక భాగం పసుపు రంగులో ఉన్నట్లు బాధితులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సరిహద్దు లొల్లి..
చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ల సరిహద్దులో మహిళ మెడలోని గొలుసు చోరీ చేసిన దుండగులు రెండు పోలీస్‌స్టేషన్ల మధ్య వివాదాన్ని సృష్టించారు. స్నాచింగ్ విషయం తెలుసుకున్న వెంటనే చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ రామారావు, అదనపు ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఘటనా స్థలికి చేరుకొని తమ పరిధి కాదని పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ చలపతి, ఎస్సై రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. తమకు రాదంటే తమకు రాదంటూ రెండు ఠాణాల అధికారులు భీష్మించుకొని కూర్చొవడంతో చివరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ కూడా అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధి ఎక్కడి వరకు వస్తుందో పరిశీలించిన ఏసీపీ చివరకు ఘటనా స్థలం చాంద్రాయణగుట్ట పరిధిలోకి వస్తుందని అంగీకరించారు. ఈ తతంగమంతా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగడం గమనార్హం.
 

>
మరిన్ని వార్తలు