హైదరాబాద్‌లో భూగర్భ రైలు!

9 Aug, 2016 08:41 IST|Sakshi
హైదరాబాద్‌లో భూగర్భ రైలు!
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో తొలి భూగర్భ రైల్వే మార్గానికి అడుగులు పడుతున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉందానగర్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దీన్ని నిర్మించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి నివేదిక అందజేయాల్సిందిగా ‘రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్)’ను రైల్వే శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి కొద్దిరోజుల్లో ఆ సంస్థ నివేదికను అందజేయనుంది.
 
హైదరాబాద్ నగరానికి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైల్వే భావిస్తోంది. నగరంలో ట్రాఫిక్ చిక్కులకు కొంతమేర పరిష్కారంగా గతంలో నిర్మించిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఫలక్‌నుమా స్టేషన్‌తో నిలిచిపోయింది. శివారు ప్రాంతాలను ఎంఎంటీఎస్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు రెండో దశను కూడా రైల్వే ప్రారంభిం చింది. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించిన రైల్వే.. ప్రాజెక్టుకు రూ.200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది.

విమానాశ్రయానికి చేరువగా కాచిగూడ-మహబూబ్‌నగర్ రైలు మార్గంపై ఉన్న ఉందానగర్ స్టేషన్ మీదుగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడినుంచి విమానాశ్రయం ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయి తే విమానాశ్రయం వరకు రైల్వే లైను ఏర్పాటు చేయడాన్ని జీఎంఆర్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో విమానాశ్రయాన్ని విస్తరిస్తామని, ఇందుకు అదనపు టెర్మినళ్లు, రన్‌వే అవసరం ఉంటుందని, వీటిని దృష్టిలో ఉంచుకుని కొంత స్థలాన్ని సిద్ధంగా ఉంచుకున్నామని చెబుతోంది. రైల్వే లైన్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో విస్తరణ సాధ్యం కాదని సర్వేలో తేలితే.. ఎట్టి పరిస్థితిలో ఎంఎంటీఎస్ లైన్ ఏర్పాటుకు అంగీకరించబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.

ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రాష్ట్రప్రభుత్వం ద్వారా జీఎంఆర్‌తో మాట్లాడించి ఆమోదం వచ్చే లా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికీ జీఎంఆర్ అంగీకరించకపోతే భూగర్భ లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌తో విమానాశ్రయాన్ని అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానితో ఆదివారం నగరానికి వచ్చిన ప్రభు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సందర్భంలో దీనిపై చర్చించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జీఎంఆర్‌తో మాట్లాడినా ఫలితం రాలేదు. ఇప్పుడు మరోమారు మాట్లాడినా సానుకూల ఫలితం వచ్చే అవకాశం లేదని, భూగర్భ ట్రాక్ నిర్మాణం తప్పదనే అభిప్రాయాన్ని రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు