అగ్రరాజ్యంలో కరోనా తాండవం

5 Jul, 2020 01:42 IST|Sakshi

అమెరికాలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 57,683 కేసులు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 57,683 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. అలాగే 728 మంది కరోనా బాధితులు మృతిచెందారు. శనివారం రాత్రి నాటికి అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,12,166కు, మరణాల సంఖ్య 1,32,196కు చేరింది.

  ప్రతిఏటా అట్టహాసంగా జరిగే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈసారి సాదాసీదాగా ముగిశాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అధికారుల సూచనల మేరకు జనం ఇళ్లలోనే ఈ వేడుకలు జరుపుకున్నారు. కొన్నిచోట్ల మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ బాణాసంచా కాల్చారు. స్వాతంత్య్ర దినం ఈ ఏడాది వారాంతంలో వచ్చింది. సాధారణంగా వారాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, వీధులు, బీచ్‌లు జనంతో కిక్కిరిసిపోతాయి. ఇప్పుడు మాత్రం బోసిపోయి కనిపించాయి.

చవగ్గా విద్యుత్‌రహిత కరోనా టెస్ట్‌ పరికరం
కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా రోగి లాలాజలంలోని వివిధ పదార్థాలను వేరుచేసి, కరోనా వైరస్‌ని కనుగొనేందుకు తక్కువ ఖర్చుతో విద్యుత్‌ రహిత సెంట్రిఫ్యూజ్‌ పరికరాన్ని భారతీయ శాస్త్రవేత్తల సారథ్యంలోని పరిశోధకులు అభివృద్ధిపరిచారు. ‘హ్యండీఫ్యూజ్‌’ పరికరం చాలా వేగంగా పనిచేస్తుందని, ఇది విద్యుత్‌ అవసరం లేకుండా, కరోనా సోకిన వారి లాలాజలంలోని వైరస్‌ జన్యువుని ఇతర విభాగాల నుంచి వేరు చేసేందుకు ఉపయోగపడుతుందని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ మను ప్రకాష్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు