కరోనా: మృతుల్లో నల్ల జాతీయులే ఎక్కువ

8 May, 2020 15:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ బారిన పడిన చనిపోతున్న వారిలో నల్లజాతీయులే అధికంగా ఉన్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్‌-19 బాధితుల్లో శ్వేత జాతీయులతో పోలిస్తే నల్లజాతీయులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్టు తేలింది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో సగానికిపైగా నల్లజాతీయులు ఉన్నారని, మరణాల్లోనూ దాదాపు 60 శాతం మంది వీరేనని ఆంఫర్‌ అనే అమెరికా ఎయిడ్స్‌ పరిశోధన సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ తెలిపింది. సామాజిక-ఆర్థిక అంశాలే ఇందుకు కారణమని వివరించింది. ఆరోగ్య సంరక్షణ విషయంలో బాగా వెనుకబడి ఉంటడం కూడా ప్రధాన కారణమని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా నల్లజాతీయుల జనాభా అధికంగా, తక్కువగా ఉన్న కౌంటీల్లోని కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలను పరిశీలించారు. (క‌రోనా: మూడో రోజుకు ఇలా అవుతుంది)

దేశవ్యాప్తంగా నమోదైన గణాంకాలను పరిశీలిస్తే నల్లజాతీయుల జనాభా అధికంగా ఉన్న కౌంటీల్లో 52 శాతం మంది కరోనా బారిన పడగా, 58 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధ్యయకర్తలు గుర్తించారు. 3 వేలకు పైగా కౌంటీల్లో జనవరి నుంచి ఏప్రిల్‌ 13 వరకు ఉన్న సమాచారం ఆధారంగా ఈ అంచనాలకు వచ్చారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న కౌంటీల్లో నల్లజాతీయుల మరణాలు అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. నిరుద్యోగం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక నల్లజాతీయులు అధికంగా కరోనా బారినపడినట్టు పరిశోధకులు గుర్తించారు. నల్లజాతీయులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించకుంటే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: ‘నమస్తే ట్రంప్‌’తో కరోనా వ్యాప్తి!

మరిన్ని వార్తలు