ఇలా అయితే కరోనా సోకే ప్రమాదం ఎక్కువ!

8 Jun, 2020 15:05 IST|Sakshi

కీలక విషయాలు వెల్లడించిన సీడీసీ

వాషింగ్టన్‌: ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే చర్యల్లో భాగంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ నిబంధలను సడలిస్తున్నాయి. మాస్కు ధరించడం, సామాజిక ఎడబాటు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌తో కలిసి జీవించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) కరోనా వ్యాప్తి గురించి కీలక అంశాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తాజాగా తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మనిషి నుంచి మనిషికి మాత్రమే వైరస్‌ అత్యంత సులభంగా వ్యాపిస్తుందని, వస్తువులు ఇతర ఉపరితలాల ద్వారా కరోనా ట్రాన్స్‌మిషన్‌ జరిగే అవకాశం తక్కువని పేర్కొంది. అదే విధంగా జంతువుల నుంచి మనిషికి వైరస్‌ సోకే అవకాశం కూడా తక్కువేనని వెల్లడించింది. (ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?)

ఈ మేరకు ‘‘కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు, మాట్లాడినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల ద్వారా వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఆ సమయంలో మనం సదరు వ్యక్తికి ఆరు అడుగుల దూరంకన్నా తక్కువ దూరంలో మాత్రమే ఉంటే వైరస్‌ సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉన్నట్లు’’ అని పేర్కొంది. అదే విధంగా నర్సింగ్‌ హోంలు, జైళ్లు, క్రూయిజ్‌ షిప్పులు, మాంసం ప్యాకింగ్‌ ప్లాంట్లు తదితర ప్రదేశాల్లో అత్యధిక మంది గుమిగూడే అవకాశం ఉన్నందున వైరస్‌ సులభంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. వాషింగ్టన్‌లో మార్చిలో గాయక అభ్యాస బృందం వల్ల దాదాపు 52 మందికి కరోనా పాజిటివ్‌ తేలిన విషయాన్ని ఈ సందర్భంగా సీడీపీ ఉటంకించింది. ఇలాంటి సూపర్‌ స్ప్రయిడ్‌లను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.(కరోనా కట్టడికి రాగి పూత వేయాల్సిందే!)

కరోనా ఎలా సోకుతుంది?
కరోనా పేషెంట్‌ నుంచి ఓ వ్యక్తిలోకి కరోనా చేరాలంటే ఆ వైరస్‌కు దాదాపు 1000 కణాలు (వైరల్‌ పార్టికల్స్ - వీపీ‌) చేరాలి. (శ్వాస ద్వారా నిమిషానికి 20వీపీ, మాట్లాడినపుడు 200 వీపీ, దగ్గినపుడు 200 మిలియన్‌ వీపీ (వెంటిలేషన్‌ తక్కువగా ఉన్న చోట గాలిలో ఇవి కొన్ని గంటల పాటు బతికే ఉంటాయి), తుమ్మినపుడు 200 మిలియన్‌ వీపీ). ఇలా వీపీలను పరిగణలోకి తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని అంచనా వేయొచ్చు.

సక్సెస్‌ఫుల్‌ ఇన్‌ఫెక్షన్‌కు ఫార్ములా
వైరస్‌కు ఎక్స్‌పోజ్‌ అయి ఉన్న తీరు *సమయం =  సక్సెస్‌ఫుల్‌ ఇన్‌ఫెక్షన్‌
ఉదాహరణకు :కరోనా ఉన్న వ్యక్తికి ఆరడుగుల దూరంలో 45 నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటే మనకు కరోనా సోకే అవకాశం తక్కువే. ఇకపోతే, మాస్కు ధరించినప్పటికీ ఆ వ్యక్తి ముఖంలో ముఖం పెట్టి అంటే అత్యంత సమీపం నుంచి అతడితో 4 నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే వైరస్‌ మనలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

  • ఇక ఆ వ్యక్తులు మన పక్కనుంచి నడుచుకుంటూ లేదా సైక్లింగ్‌ చేసుకుంటూ వెళ్లినట్లయితే వైరస్‌ అంటుకునే ప్రమాదం తక్కువగానే ఉంటుంది. అంతేకాదు వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నిర్ణీత సమయం పాటు వైరస్‌ మనదరి చేరే అవకాశం ఉండదు. 
  • అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కిరాణా, కూరగాయల కొట్టుకు వెళ్లినపుడు కరోనా బారిన పడే రిస్క్‌ మధ్యస్థంగా ఉంటుంది. 
  • ఇక అన్నింటికంటే ఇండోర్‌ స్సేస్‌లో ఎక్కువ సేపు గుమిగూడి ఉండటం అత్యంత ప్రమాదకరం.
  • పబ్లిక్‌ బాత్‌రూంలు, సామూహిక ప్రదేశాలు, రెస్టారెంట్ల లోపల కూర్చోవడం చాలా రిస్కుతో కూడుకున్న పని. తద్వారా కరోనా తొందరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 
  • అంతేకాదు ఆఫీసులు, పాఠశాలల్లో భౌతిక దూరం పాటించినప్పటికీ వైరస్‌ సోకే ప్రమాదం అత్యంత ఎక్కువగా ఉంటుంది. 
  • పార్టీలు, పెళ్లిళ్లు, వ్యాపార కేంద్రాలు, సమావేశాలు, సినిమా హాళ్లు, కన్సర్ట్‌లు, ప్రార్థనా స్థలాలు ద్వారా అధిక స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఎక్కవుగా ఉంది.
  • కాబట్టి కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బయటకు వెళ్లకుండానే పనులు చక్కబెట్టుకోగల మార్గాల కోసం అన్వేషించడం ఉత్తమం. ముఖ్యంగా ఇప్పుడే ఆఫీసుకు పరిగెత్తుకుంటూ వెళ్లాలనే భావన ఉద్యోగులు, యాజమాన్యాలకు ఉండకపోవడమే మంచిది.

ప్రమాదకర అంశాలు

  • ఔట్‌డోర్‌ కంటే ఇండోర్‌ శ్రేయస్కరం.
  • చీకటి, మూసి ఉన్న ప్రదేశాల కంటే వెలుతురులో ఉండటం మంచిది.
  • జన సాంద్రత తక్కువగా ఉన్నచోటకు వెళ్తే ప్రమాద తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది.
  • సమూహాల్లో సంచరించకపోవడం అత్యుత్తమం
మరిన్ని వార్తలు