‘కరోనా’ ప్రూఫ్‌ కారు

10 May, 2020 18:48 IST|Sakshi

బులెట్‌ప్రూఫ్‌ కార్లు అందరికీ తెలిసినవే. కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో ‘కరోనా’ప్రూఫ్‌ కారు వచ్చేసింది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ఆ మహత్తర వాహనమే! చైనాకు చెందిన ఆటోమొబైల్‌ సంస్థ ‘గీలీ’ తన ‘హెల్తీ కార్‌ ప్రాజెక్ట్‌’లో భాగంగా ఇటీవల ఈ మైక్రోబ్‌ప్రూఫ్‌ కారును రూపొందించింది. ఇందులో ‘జీ–క్లీన్‌’ ఇంటెలిజెంట్‌ ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్‌ కారులోని గాలిలో కలసిన సూక్ష్మజీవులను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ, గాలిని తాజాగా ఉంచుతుంది. ఈ కారులోని ఏసీ నుంచి గాలి వెలువడే ప్రదేశం నుంచి చల్లని గాలితో పాటు శక్తిమంతమైన అల్ట్రావయొలెట్‌ కిరణాలు కూడా వెలువడుతూ బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను తుదముట్టిస్తాయి. కారు లోపలి భాగం ఫొటోలను ‘గీలీ’ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. (2లక్షలు దాటిన కరోనా కేసులు)

యూవీ పెన్‌... సూక్ష్మజీవుల పాలిటి గన్‌
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది అల్ట్రావయోలెట్‌ స్టెరిలైజేషన్‌ పెన్‌. ఇది రాసుకోవడానికి పనికిరాదు గాని, సూక్ష్మజీవుల పాలిటి గన్‌లా మాత్రం భేషుగ్గా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌. తడిగా ఉన్న ఉపరితలాలపై కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా పనిచేస్తుంది. హైటెక్‌ వస్తువులను తయారు చేసే చైనీస్‌ కంపెనీ ‘జియావోమి పెటొనీర్‌’ ఇటీవల ఈ యూవీ స్టెరిలైజేషన్‌ పెన్‌ను తయారు చేసింది. ఇది 2200ఎంఏహెచ్‌ రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేసుకుంటే, ఇది నిరంతరాయంగా రెండున్నర గంటల సేపు పని చేస్తుంది. (ఇప్పుడెలాగో.. అప్పుడూ అలాగే)

ఇందులో రెండు మోడ్స్‌ ఉంటాయి. ఒకటి 90 సెకండ్ల మోడ్, మరొకటి 60 సెకండ్ల మోడ్‌. ఎంపిక చేసుకున్న వేగాన్ని బట్టి ఎంచుకున్న ఉపరితలంపై ఉన్న సూక్ష్మజీవులను పూర్తిగా నిర్మూలిస్తుంది. దీని నుంచి 253.5ఎన్‌ఎం వేవ్‌లెంగ్త్‌తో విడుదలయ్యే అల్ట్రావయోలెట్‌ కిరణాలు బ్యాక్టీరియా, వైరస్‌ వంటి మహా మొండి సూక్ష్మజీవులను సైతం క్షణాల్లోనే ఖతం చేసేస్తాయి. గాఢమైన రసాయనాల వాసనలు సరిపడని వారు సూక్ష్మజీవులను సునాయాసంగా వదిలించుకోవాలంటే, ఇలాంటి పెన్‌ ఒకటి ఇంట్లో ఉండాల్సిందే! (ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్)

మరిన్ని వార్తలు