ఆగని మరణ మృదంగం

19 Apr, 2020 03:48 IST|Sakshi
లాక్‌డౌన్‌ ఎత్తివేయాలంటూ అమెరికాలోని మిన్నెసొటా గవర్నర్‌ కార్యాలయం వద్ద ప్రజల నిరసన

అమెరికాలో ఒకేరోజు 3,856 మంది మృతి

వాషింగ్టన్‌: కోవిడ్‌–19 రోజురోజుకీ విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో మృత్యుఘోష కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలు దాటితే కరోనా మరణాలు 38 వేలు దాటిపోయాయి. మరే దేశంలోనూ కరోనా ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించలేదు. నాలుగైదు రోజుల నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల్లోనే ఏకంగా 3,856 మరణాలు నమోదయ్యాయి. ఉత్తర న్యూజెర్సీలో కోవిడ్‌ కల్లోలం రేపుతోంది. రోజురోజుకీ ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నర్సింగ్‌హోమ్‌లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. జనం కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

కోవిడ్‌ కేసులు ఈ స్థాయిలో నమోదు కావడానికి ఎక్కువ మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడమే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఇప్పటివరకు 38 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి దేశాల కంటే ఎక్కువగా అమెరికాలోనే పరీక్షలు జరిగాయన్నారు. ‘‘దేశం చాలా భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. 184 దేశాల్లోనూ అదే దుస్థితి. ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాం. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు’’అని ట్రంప్‌ అన్నారు. సొరంగమార్గంలో వెళుతూ ఉంటే చిమ్మ చీకటి నెలకొంటుంది. ఇప్పుడు ఆ చీకట్లో కాంతి రేఖ కనిపిస్తోంది’’అన్న ట్రంప్‌ త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడతామంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు.  

మార్కెట్లు తెరవాల్సిందే: ట్రంప్‌
అమెరికాలో ఒకవైపు కోవిడ్‌ విజృంభణ కొనసాగుతూ ఉంటే మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌ మార్కెట్లు తెరిచే విషయంలో పట్టుదలగా ఉన్నారు. డెమొక్రాట్లు గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాలు వీలైనంత త్వరగా ఆర్థిక కార్యక్రమాలు మొదలు పెట్టాలని కోరారు. మినెసాటో, మిషిగాన్, వర్జీనియాలో ప్రజలు వెంటనే విధుల్లోకి వెళ్లాలంటూ ట్వీట్‌ చేశారు. న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ఫెడరల్‌ ప్రభుత్వాన్ని తరచు విమర్శిస్తూ సమయం వృథా చేయకుండా కోవిడ్‌ బాధితుల్ని ఆదుకోవడంలో ఎక్కువ సమయం కేటాయించాలన్నారు.

మృతుల రేటు ఇలా..
కోవిడ్‌ మృతుల రేటు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో తొలుత మరణాల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ రానురాను పెరిగిపోయింది.  
మార్చి చివరి నాటికి: 1.35%
ఏప్రిల్‌ 15 నాటికి    : 4%
ఏప్రిల్‌ 18             : 5%

► కోవిడ్‌ను అరికట్టడానికి అమెరికా అదనపు చర్యలు చేపట్టకపోతే లక్షలాది మంది దారిద్య్రరేఖకి దిగువకి వెళ్లిపోతారని ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల నిపుణులు ఫిలిప్‌ అల్సటాన్‌ హెచ్చరించారు.  ► ఆఫ్రికాలో వెయ్యి మందికి పైగా మరణించారు. నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్‌ బుహారి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ అబ్బా క్యారీ కోవిడ్‌–19తో ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.  
► బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 ఈ నెల 21న తన 94వ పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకున్నారు.  
► జింబాబ్వే 40వ స్వాతంత్య్రదిన వేడుకల్ని రద్దు చేసింది.  
► జర్మనీలో కరోనా నియంత్రణలో ఉందని, రెండో దశలో విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  
► ఇటలీలో ఇప్పుడిప్పుడే జనజీవనం కనిపిస్తూ ఉంటే, స్పెయిన్, మెక్సికో, జపాన్, బ్రిటన్‌ కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు