వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చింది: పాంపియో

8 May, 2020 01:50 IST|Sakshi

వాషింగ్టన్‌/బీజింగ్‌: కరోనా వైరస్‌ వూహాన్‌లోని పరిశోధనశాల నుంచే విడుదలైందని తమవద్ద ఆధారాలున్నాయని అమెరికా   విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో స్పష్టం చేశారు. సాక్ష్యాలను తాను స్వయంగా చూశానని ‘ఫాక్స్‌ న్యూస్‌’తో చెప్పారు. వూహాన్‌లోని ల్యాబ్‌ నుంచి వైరస్‌ విడుదలైనట్లు చైనీయులకు గత ఏడాది డిసెంబర్‌లోనే తెలిసినా అవసరమైన వేగంతో వారు స్పందించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నింటినీ రూఢి చేసుకునేందుకే విచారణకు అనుమతించాల్సిందిగా చైనాను కోరుతున్నామన్నారు.  

రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ
రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌ అమెరికాలోని పెర్ల్‌ హార్బర్‌పై చేసిన దాడి కంటే ఎక్కువ నష్టం ప్రస్తుతం కరోనా వైరస్‌తో వాటిల్లిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కోవిడ్‌ చికిత్సలో కీలకపాత్ర పోషిస్తున్న నర్సులతో ట్రంప్‌ మాట్లాడుతూ.. నర్సులు అసలైన అమెరికన్‌ హీరోలని, పదకొండేళ్లుగా నర్సుగా పనిచేస్తున్న లూక్‌ ఆడమ్స్‌... న్యూయార్క్‌లో వైరస్‌ విజృంభణ తెలియగానే అక్కడికి చేరుకుని తన కారులోనే ఉంటూ తొమ్మిది రోజులపాటు కోవిడ్‌ రోగులకు సేవలందించారని తెలిపారు.  

వూహాన్‌ ల్యాబ్‌లో ఫ్రాన్స్‌..
వూహాన్‌లోని పీ4 వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఫ్రాన్స్‌ భాగస్వామ్యంతోనే నిర్మించామని సిబ్బంది మొత్తం అక్కడే శిక్షణ పొందారని చైనా పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో వైరస్‌ పుట్టుకపై అన్నీ కట్టుకథలు చెబుతున్నారని, పీ4 ల్యాబ్‌ ఫ్రాన్స్‌ భాగస్వామ్యంతో ఏర్పాటైన సంగతి ఆయనకు ఇంకా తెలిసినట్లు లేదని చైనా వ్యాఖ్యానించింది. ల్యాబ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని, నిర్వహణ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలిపింది.

పెర్ల్‌ హార్బర్‌ దాడి  కంటే కరోనా వైరస్‌ దాడి చాలా పెద్దదని ట్రంప్‌ చెబుతున్నారని, అయితే అమెరికా శత్రువు కరోనా వైరస్‌ అవుతుంది గానీ చైనా కాదని అన్నారు. వైరస్‌పై పోరాడేందుకు అమెరికా చైనాతో కలిసి రావాలని కోరారు. ఐక్యరాజ్య సమితిలో చైనా దౌత్యవేత్త చెన్‌ షూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో విచారణకు అంగీకరించినట్లు వచ్చిన వార్తలపై హువా స్పందిస్తూ.. తాము ప్రపంచ ఆరోగ్య సంస్థను వ్యతిరేకిస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని, వైరస్‌ పుట్టుకపై పారదర్శకంగానే ఆ సంస్థకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు