ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయుడు

28 Apr, 2020 04:27 IST|Sakshi

అమెరికాలో భారత సంతతి వైద్యుల సంఘం అధ్యక్షుడు సురేశ్‌ రెడ్డి

లాక్‌డౌన్‌ ఎత్తివేతపై తొందరపాటు తగదు

న్యూయార్క్‌/మాస్కో/బీజింగ్‌: అమెరికాలోని ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయ సంతతికి చెందిన వారని అమెరికన్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (ఆపీ) అధ్యక్షుడు సురేశ్‌ రెడ్డి తెలిపారు. వేలాది మంది భారతీయ వైద్యులు యుద్ధంలో సైనికుల మాదిరిగా ముందు వరుసలో ఉంటూ కోవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ‘ఈ మహమ్మారిపై యుద్ధం అంత తొందరగా ముగిసేది కాదు.

వ్యాక్సిన్, యాంటీ వైరల్‌ ఔషధం కనుక్కునేవరకూ ఒకటీరెండేళ్లు దీని పీడ ఉంటుంది. గేట్లు తెరిచేసినట్లు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సాధ్యం కాదు. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వైరస్‌ మళ్లీ వచ్చేస్తుంది. ఈసారి నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు.భవిష్యత్తులో లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ పరిస్థితి గతంలో మాదిరిగా ఉండదని, తరచూ చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కానుందని డాక్టర్‌ సురేశ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

874 మంది రష్యా సైనికులకు కరోనా
తమ సైనికుల్లో 874 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. బాధితుల్లో సగం మందిని ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచామని, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మొత్తంగా 87,147 మంది కోవిడ్‌ బారిన పడగా 794 మంది మృతి చెందారు.  

వూహాన్‌లో అందరూ డిశ్చార్జ్‌
వైరస్‌ పుట్టినిల్లు వూహాన్‌లో చిట్టచివరి రోగిని డిశ్చార్జ్‌ చేయడంతో సోమవారం అక్కడ కోవిడ్‌–19 బాధితుల సంఖ్య సున్నకు చేరుకుంది. ఈ మహమ్మారి బారిన పడ్డ 82,830 మందిలో 4,633 మంది ప్రాణాలు కోల్పోగా 723 మందికి చికిత్స కొనసాగుతోంది. మిగిలిన 77,474 మందికి స్వస్థత చేకూరిందని చైనా ఆరోగ్య సోమవారం ప్రకటించింది.

అమెరికాపై చైనా విసుర్లు
కరోనా వైరస్‌ పుట్టుకపై విచారణ జరపాలన్న అమెరికాపై చైనా ఎదురుదాడికి దిగింది.  కరోనా వైరస్‌ అంశంపై చైనాపై విమర్శలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు అమెరికా అధికార రిపబ్లికన్‌ పార్టీ ప్రయత్నిస్తోందని చైనా అధికార పత్రిక షిన్‌హువా పేర్కొంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల వైరస్‌ అగ్రరాజ్యంలోని బాధితుల కష్టాలు మరింత పెరుగుతాయని తెలిపింది. కరోనా వైరస్‌ వంటి విషయాల్లో అంతర్జాతీయ స్థాయి విచారణ ఇప్పటివరకూ ఏ దేశంపైనా జరగలేదని తెలిపింది.

మరిన్ని వార్తలు