ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు

25 Jun, 2020 04:28 IST|Sakshi

రికవరీ రేటులో భారత్‌ స్థానం 4

దేశంలో రాజస్తాన్‌ నంబర్‌ 1

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్‌ దేశాలను కరోనా వైరస్‌ భయపెడుతూనే ఉంది. ఈ దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కోవిడ్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ వైరస్‌ సోకిన వారిలో సగం మందికి పైగా కోలుకోవడం భారీగా ఊరటనిచ్చే అంశం. ఇతర వ్యాధులు లేకుండా కేవలం కోవిడ్‌ కారణంగా చనిపోయిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 94 లక్షల కేసులు నమోదు కాగా 50.65 లక్షల మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు.

అంటే రికవరీ రేటు 54 శాతంగా ఉంది. మన దేశంలో కరోనా వైరస్‌ సోకినా పెద్దగా భయపడాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. 56.70శాతం రికవరీ రేటుతో భారత్‌ అత్యంత సురక్షితమైన స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రికవరీ రేటుతో పోల్చి చూస్తే మనం మెరుగైన స్థానంలో ఉన్నాం. అంతేకాదు అత్యధిక రికవరీ రేటుతో ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానానికి చేరుకొని ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఇక భారత్‌లో రాజస్తాన్‌ 78శాతం రికవరీ రేటుతో మొదటి స్థానంలో ఉంది.  

భారత్‌లో రికవరీ రేటు ఎలా పెరిగింది ?

► భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటినప్పటికీ వాటిలో సీరియస్‌ కేసులు కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వారందరికీ వైరస్‌ స్వల్పంగా, మధ్యస్థంగా సోకింది. దీంతో రికవరీ రేటు ఎక్కువగా ఉంది.  

► వైరస్‌ బట్టబయలైన తొలిరోజుల్లో అందరినీ ఆస్పత్రికి తీసుకువెళ్లి క్వారంటైన్‌ చేసేవారు. కానీ ఆ తర్వాత ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ మెడికల్‌ (ఐసీఎంఆర్‌) తన విధానాన్ని మార్చుకుంది. స్వల్ప లక్షణాలున్న వారిని హోం క్వారంటైన్‌లో ఉంచాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. చిన్నపాటి జ్వరం, గొంతునొప్పి ఉన్నవారు ఇంట్లో వైద్యుల సూచన మేరకు వ్యవహరిస్తూ 10 రోజుల్లోనే కోలుకుంటున్నారు.  

► భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లతో  వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ. క రోనా వైరస్‌కు మందు లేకపోవడం వల్ల ఇమ్యూని టీని పెంచడానికే మందులు ఇస్తున్నారు. ఈ తర హా చికిత్సకు భారతీయులు త్వరగా స్పందిస్తున్నారు

► కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ట్రేస్, టెస్ట్, ట్రీట్‌ విధానమే మార్గం. ఆ దిశగా భారత్‌ అడుగులు బలంగానే పడుతున్నాయి. 3 నెలల క్రితం రోజుకి సగటున 100 కూడా కోవిడ్‌ పరీక్షలు జరిగేవి కావు. అలాంటిది ఇప్పుడు రోజుకి 2 లక్షల పరీక్షలు జరుగుతున్నాయి. అత్యంత పకడ్బందీ ప్రణాళికతో వైరస్‌ అనుమానితుల్ని పట్టుకొని క్వారంటైన్‌ చేయడం వల్ల రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

భారత్‌లో రికవరీ 2.58 లక్షలు 
భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది. గత 24 గంటల్లో 15,968 కేసులు నమోదయ్యాయని, 465 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మృతుల సంఖ్య 14,476కి చేరుకుంది. అయితే ప్రతీ లక్ష మంది జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే మన దేశంలో మృతుల సంఖ్య అత్యల్పంగా ఉన్నట్టుగా శాఖ అధికారి ఒకరు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ లక్ష మంది జనాభాకి ఆరుగురు కోవిడ్‌తో మరణిస్తే, భారత్‌లో ఆ సంఖ్య ఒక్కటి మాత్రమే. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు ఇప్పటివరకు 2.58 లక్షల మంది ఉన్నారు.

ఢిల్లీలో ఒక్కరోజే దాదాపుగా 4 వేల కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 66,602కి చేరుకుంది. దీంతో జూలై 6లోపు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని కేజ్రీవాల్‌ ప్రభుత్వం వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తమోనష్‌ ఘోష్‌ కోవిడ్‌తో మృతి చెందారు. కోల్‌కతాలో ఓ ఆస్పత్రిలో మే నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఘోష్‌కు అప్పటికే గుండె, కిడ్నీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో బుధవారం ఆయన మరణించారు.

ప్రపంచంలో జర్మనీ టాప్‌  
కోవిడ్‌–19 బారినపడి కోలుకున్న వారిలో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో లక్షా 92 వేల కేసులు నమోదైతే, ఇప్పటివరకు లక్షా 75 వేల మందివరకు కోలుకున్నారు. ఆ తర్వాత స్థానంలో ఇరాన్, ఇటలీ నిలిచాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. ఆ దేశంలో కోలుకున్న వారు 40శాతం మంది మాత్రమే ఉన్నారు. 

మరిన్ని వార్తలు