ఈ మారణహోమానికి చైనాదే బాధ్యత

6 Jul, 2020 04:03 IST|Sakshi

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మండిపాటు

కరోనా ముప్పును దాచి పెట్టిందని డ్రాగన్‌ దేశంపై ఆరోపణ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తికి, ప్రపంచవ్యాప్తంగా అది సృష్టించిన మారణహోమానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మండిపడ్డారు. కరోనా కల్లోలానికి పూర్తి బాధ్యత ఆ వైరస్‌ ముప్పును దాచిపెట్టిన డ్రాగన్‌ దేశానిదేనన్నారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం దేశ ప్రజలనుద్దేశించి ట్రంప్‌ ప్రసంగించారు. దేశంలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. ఆ ప్రాణాంతక వైరస్‌పై పోరాటంలో ముందున్నామన్నారు. వెంటిలేటర్లు, పీపీఈ కిట్స్, ఇతర సర్జికల్‌ సామగ్రి రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామన్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఇవన్నీ విదేశాల నుంచి.. ముఖ్యంగా చైనా నుంచి అత్యధికంగా దిగుమతి అయ్యేవన్నారు. ‘కుట్రపూరితంగా కరోనా ముప్పును చైనా రహస్యంగా దాచిపెట్టడం వల్లనే అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీనికి బాధ్యత కచ్చితంగా చైనాదే’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలోగా అమెరికాలో కోవిడ్‌–19కు ఔషధం, కరోనా వైరస్‌కు టీకా అమెరికాలోనే కనుగొంటామని ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు.  

అమెరికా లవ్స్‌ ఇండియా
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని ¯మోదీకి ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా భారత్‌ను అభిమానిస్తోందంటూ ట్వీట్‌ చేశారు. ‘థాంక్యూ మై ఫ్రెండ్‌.. అమెరికా లవ్స్‌ ఇండియా’ అని ట్రంప్‌  పేర్కొన్నారు. అంతకుముందు, 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు, ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ట్వీట్‌ చేశారు.  మోదీ, ట్రంప్‌ ట్వీట్‌ సంభాషణను పలువురు నెటిజెన్లు స్వాగతించారు. 1776 జులై 4న గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి అమెరికా స్వాతంత్య్రం పొందింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు