వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్‌..!

22 Apr, 2020 09:59 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా పౌరుల ఉద్యోగాల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే ఈ నిషేధం 60 రోజులపాటు అమల్లో ఉంటుందని ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. ఈ నిషేధం శాశ్వత నివాసం(గ్రీన్‌ కార్డ్‌) కోరుకునే వారికే వర్తింస్తుందని ట్రంప్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ముగిసన తర్వాత.. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్‌ స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించిన రోజువారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ విషయాలను వెల్లడించారు.

‘ఈ నిషేధం 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని పొడిగించడమా.. లేక మార్పులు చేయడమా అనేది నిర్ణయిస్తాం. అమెరికాలో శాశ్వత నివాసం(గ్రీన్‌ కార్డ్‌) కోరుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. తాత్కాలిక ప్రతిపాదికన అమెరికాలోకి వచ్చేవారికి ఈ నిషేధం వర్తించదు. అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలనేది మా లక్ష్యం. వలసలను నియంత్రించడం వల్ల నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ట్రంప్‌ ప్రస్తావించినందువల్ల నాన్‌–ఇమిగ్రంట్‌ వీసా అయిన హెచ్‌1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. 

అయితే కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, ఆహార సరఫరా చేస్తున్న విదేశీయులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పించవచ్చని వైట్‌ హౌస్‌ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కరోనాను అదుపు చేయడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గత అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి యూఎస్‌ ఇమిగ్రేషన్‌ వ్యవస్థను ట్రంప్‌ లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో వీసా విధానాన్ని మార్చాలన్న తన ఆలోచనను ఆయన వెల్లడించారు.  ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక అగ్రరాజ్యం జారీ చేసే వీసాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది. కాగా, 2016లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 6,17,000 వీసాలు జారీ చేసిన అమెరికా.. గతేడాదిలో  4,62,000 వీసాలు మాత్రమే జారీచేసినట్టు అధికారిక గణంకాలు చెప్తున్నాయి.

చదవండి : అన్ని ఇమిగ్రేషన్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం

కిమ్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా: ట్రంప్‌

మరిన్ని వార్తలు