ప్రధాని భార్యపై కామెంట్‌.. జోకులు

3 May, 2018 09:18 IST|Sakshi
మాల్కోమ్‌ టర్న్‌బుల్‌, లూసీ దంపతులతో ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌

సిడ్నీ: భాష.. దాని అనువాదంలో వచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. పొరపాటున తేడాలు వస్తే అర్థాలు మారిపోయి ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుంది. తాజాగా ఫ్రాన్స్‌ ప్రధాని ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్‌ టర్న్‌బుల్‌ భార్య లూసీని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన మాక్రోన్‌.. మాల్కోమ్‌తో బుధవారం కీలక సమావేశంలో పాల్గొన్నారు. భేటీ ముగిశాక మాల్కోమ్‌ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ... ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఓ సందేశం ఇచ్చారు. ‘మీరిచ్చిన స్వాగతానికి ధన్యవాదాలు. మీకు, మీ ‘రుచికరమైన’ (Delicious)భార్య ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు’ అంటూ మాక్రోన్‌ పేర్కొన్నారు. అంతే... ఆ మాట ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించేసింది. ‘నోరు జారిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు’.. ‘ప్రధాని భార్యపై అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలు’.. అంటూ హెడ్డింగ్‌లతో ఊదరగొట్టేసింది.  మరోపక్క సోషల్‌ మీడియాలో మాక్రోన్‌ స్టేట్‌మెంట్‌పై జోకులు పేలాయి. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందో? అని కొందరు.. వైన్‌ బదులు వైఫ్‌ అని పొరపాటున ఉచ్ఛరించారేమో అని కొందరు.. చాలా మందికి మట్టు ఆ కామెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఫ్రెంచ్‌ కార్యాలయం స్పందన...
‘నిజానికి ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు. అనువాద దోషంలో దొర్లిన ఓ తప్పిదం మూలంగానే ఆయన ఆ కామెంట్‌ చేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్‌ వంటకాలతో, ఫ్రెంచ్‌ అధికారులతో ఏర్పాసిన డిన్నర్‌ పట్ల మాక్రోన్‌ సంతోషం వ్యక్తం చేశారు. అందుకే టర్న్‌బుల్‌-ఆయన భార్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. Delicious-Delicieux ఫ్రెంచ్‌లో-Delightful(చూడముచ్చటైన) అర్థం. ఫ్రెంచి అనువాదకుడి ఉపన్యాసాన్నే మాక్రోన్‌ చదివి వినిపించారు. దీనిపై పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదు’ అని ఆస్ట్రేలియాలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అన్నట్లు గతేడాది ఫ్రాన్స్‌ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆ సమయంలో మాక్రోన్‌ భార్య బ్రిగెట్టేను ఉద్దేశించి ట్రంప్‌ చేసిన ఓ వ్యాఖ్య చర్చనీయాంశమైంది.

 "I want to thank you for your welcome, thank you and your delicious wife for your warm welcome,"

మరిన్ని వార్తలు