యూకేలో భారత సంతతి వైద్యుడి మృతి

30 May, 2020 09:41 IST|Sakshi

లండన్‌: కరోనా సంక్షోభ సమయంలో యూకేలో ప్రజలకు సేవ చేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ వైద్యుడు హోటల్‌ గదిలో మృతి చెందాడు. వివరాలు.. డాక్టర్‌ రాజేష్‌ గుప్తా ఆగ్నేయ ఇంగ్లండ్‌ బెర్క్‌షైర్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) ట్రస్ట్‌ అధ్వర్యంలో నడుస్తున్న వెక్షం పార్క్ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌ కన్సల్టెంట్‌‌(మత్తుమందు)గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పేషంట్లకు వైద్యం చేస్తుండటంతో కుటుంబ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి సమీపంలోని ఓ హోటల్‌లో రాజేష్‌ గుప్తా ఒక్కరే ఉంటున్నారు.

ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రాజేష్‌ గుప్తా హోటల్‌ గదిలో మరణించాడు. అయితే ఇందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ సందర్భంగా  ఫ్రిమ్లీ హెల్త్ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్ ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మా సహోద్యోగి డాక్టర్‌ రాజేష్‌ గుప్తా సోమవారం మధ్యాహ్నం వరకు మాతో కలిసి కరోనా పేషంట్లకు వైద్యం చేశారు. విధులు ముగిసిన తర్వాత ఆయన బస చేస్తున్న హోటల్‌కు వెళ్లారు. తర్వాత ఆయన మరణించినట్లు తెలిసింది. రాజేష్‌ అద్భుతమైన కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, వంట బాగా చేస్తాడు. చాలా ఉత్సాహవంతడు. మంచికి మానవత్వానికి ప్రతీకలాంటి వాడు. అతను అనేక పుస్తకాలు రాశాడు.. ఇతరుల రచనలకు సహకరించాడు. అతడి ఆకస్మిక మరణం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అతడిని చాలా మిస్‌ అవుతున్నాం’ అని ప్రకటనలో తెలిపింది.

జమ్మూలో ఉన్నత విద్యను అభ్యసించిన రాజేష్‌ గుప్తాకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ వార్త వారిని ఎంతో కుంగదీస్తుందని ఫ్రిమ్లీ హెల్త్ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్ ట్రస్ట్ తెలిపింది. ప్రస్తుతం రాజేష్‌ మృతికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సదరు ట్రస్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు