ఒక్కరోజే 1000 కరోనా మరణాలు.. స్వార్థం వద్దు ప్లీజ్‌!

28 Mar, 2020 14:42 IST|Sakshi

రోమ్‌: యూరప్‌ దేశం ఇటలీపై కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ ధాటికి ఆ దేశం చిగురటాకులా వణికిపోతోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ ఇప్పటికే అక్కడ వేలాది మందిని బలితీసుకోగా... కేవలం శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 9134కు చేరింది. అదే విధంగా దాదాపు 86 వేల మంది ఈ అంటువ్యాధి బారిన పడ్డారు. ఈ మహమ్మారి పురుడుపోసుకున్న చైనాలోని మరణాల కంటే ఇటలీలో సంభవించిన మరణాలు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. కేవలం వారాల వ్యవధిలోనే వేలాది మంది కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే గత వారంతో పోలిస్తే శుక్రవారం నాటికి కరోనా మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైందని... సగటు మరణాల శాతం 8 నుంచి 7.4 శాతానికి పడిపోయిందని జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొంది. (కరోనా: ఊపిరితిత్తుల పరిస్థితి ఇది.. తస్మాత్‌ జాగ్రత్త!)

ఈ విషయం తమలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తోందని.. అయితే కరోనాపై మరింత కఠినంగా పోరాడాల్సి ఉందని ఆ సంస్థ చీఫ్‌ సిల్వియో బ్రుసాఫెరో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో సత్ఫలితాలు పొందగలుగుతున్నామన్నారు. కాగా ఇటలీలో మార్చి 9 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ గడువు(ఏప్రిల్‌ 3)ను మరికొన్ని రోజుల పాటు పొడగించే అవకాశం ఉందని ఇటలీ ప్రధాని గుసిప్పీ కోంటే గత వారం ప్రకటన విడుదల చేశారు. కాగా కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే అక్కడ కుప్పలుతెప్పలుగా శవాలను చూడాల్సి వస్తోందంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.(కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!)

సెల్ఫిష్‌గా ఉండకండి..
విపత్కర పరిస్థితుల్లో ఇటలీకి ఫ్రాన్స్‌ అండగా నిలుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ భరోసా ఇచ్చారు. ఓ ఇటలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ చైనా, రష్యాల సహాయం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇటలీకి ఫ్రాన్స్‌, జర్మనీ కూడా సహాయం చేస్తున్నాయి. రెండు మిలియన్ల మాస్కులు, వందల కొద్దీ గౌన్లు(వైద్య సిబ్బందికి) అక్కడికి పంపించాం. అయితే ఇది ఏమాత్రం సరిపోదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మేం వారికి మరింత సాయం చేస్తాం. ఈ కష్టం కేవలం ఇటలీ, స్పెయిన్‌కో పరిమితం కాదు. ప్రతీ ఒక్కరికి ఎదురవుతుంది. అందుకే యూరోప్‌ కలిసికట్టుగా ఉండాలి. స్వార్థంగా ఉండకండి. స్వార్థపూరితమైన.. ఐకమత్యంగా లేని యూరప్‌ను నేను కోరుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు.(కరోనా: 64 దేశాలకు అమెరికా సాయం.. )

కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!

అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు?

కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?

మరిన్ని వార్తలు