లాక్‌డౌన్‌ ఇప్పట్లో ముగిసేలా లేదు!

11 May, 2020 08:52 IST|Sakshi

లండన్‌ : బ్రిటన్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌తో పెద్ద ఎత్తున ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఆ మధ్య కాస్త తగ్గినట్లే కనిపించినా.. గడిచిన రెండు వారాల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడారు. మహమ్మారి విరుగుడుకు విధించిన లాక్‌డౌన్‌ ఇప్పట్లో ముగిసేలా లేదని అన్నారు. ప్రజలంతా ఎవరికివారు జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. వైరస్‌ ప్రభావం ఎక్కువకాలం ఉండే అవకాశం ఉందని, దీనికి సరైన ఔషదం వచ్చే వరకు లాక్‌డౌన్‌ తప్ప మరో దారిలేదని స్పష్టం చేశారు. దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తూనే పలు కార్యక్రమాలకు ఆంక్షలను నుంచి సడలింపులు ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. (కరోనా పోరులో ట్రంప్‌ విఫలం)

దీనిలో భాగంగానే ప్రజలు బయటకువచ్చి వ్యాయామం చేసుకునేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అలాగే వర్క్‌ ఫ్రం హోమ్‌ చేయలేని వారు కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వర్తించవచ్చని ప్రకటించారు. కానీ అన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా బౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. బ్రిటన్‌తో పాటు వేల్స్‌, స్కాట్లాండ్‌ దేశాల కూడా లాక్‌డౌన్‌ నిబందనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ‘స్టే ఎట్‌ హోం’ నినాదంతో పాటు ‘స్టే సేఫ్టీ’ నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురావాలని అధికారులకు ప్రధాని సూచించారు. జూన్‌ మొదటి వారంలోపు పరిస్థితి అదుపులోకి వస్తే పాఠశాలతో పాటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలను ఓపెన్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా ఇప్పటి వరకు బ్రిటన్‌లో 219,183 కరోనా కేసులు నమోదు కాగా.. 32 వేలకు పైగా మరణాలు సంభవించాయి. (2లక్షలు దాటిన కరోనా కేసులు)

మరిన్ని వార్తలు