మహా మంచి విషయం.. కరోనాలో పాజిటివ్‌..

11 May, 2020 04:35 IST|Sakshi

కరోనా అలాగా.. కరోనా ఇలాగా.. ఇప్పుడే సబ్జెక్టు మాట్లాడినా.. ఆవు వ్యాసంలాగ చివరికి మళ్లీ కరోనా దగ్గరకు రావాల్సిందే.. అలా అయిపోయింది బతుకు.. ఈ కోవిడ్‌ గోల మధ్యలో ప్రపంచంలో రకరకాల రంగాల్లో జరుగుతున్న కొన్ని మంచి విషయాలు చర్చకే రావడం లేదు.. ఈ మంచి మన మంచికే.. అందుకే ఈ కరోనా కాలంలో జరిగిన కొన్ని పాజిటివ్‌ వార్తల సంగతేంటో ఓసారి చూద్దామా..

ఆకాశ వీధిలో..
రాత్రివేళల్లో అసలైన నల్లటి ఆకాశం (డార్క్‌ స్కై) కలిగిఉన్న మొదటి దేశంగా ‘నియువే’ అనే ద్వీపాన్ని ఇంటర్నేషనల్‌ డార్క్‌ స్కై అసోసియేషన్‌ ప్రకటించింది. నక్షత్రాలు స్పష్టంగా చూడా లంటే ఇక్కడే చూడాలట.. దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న ఈ ద్వీపం మిగతావాటికి దూరంగా ఉంటుంది. దీని వల్ల వేరే దేశాల నుంచి కృత్రిమ వెలుగు ఈ ద్వీపాన్ని తాకదు.ఇక్కడ ఉండేది 1,600 మందే. రాత్రివేళల్లో కృత్రిమ వెలుగును చాలావరకూ తగ్గించేలా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇళ్లల్లో, వీధుల్లో లైట్లు ఉన్నా.. అవి తక్కువ వెలుతురు పంచేలా ఉంటాయట. 

అన్నిటికీ ఒకటే..
ఇన్‌çఫ్లూయెంజా వైరస్‌ను తట్టుకునేందుకు ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు సరికొత్త యూనివర్సల్‌ వ్యాక్సిన్‌ను కనిపెట్టారు. అంటే ఇది అన్ని రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై పోరాడుతుందన్న మాట. ఇప్పటివరకూ ఉన్నవి కొన్ని రకాలవాటిపై మాత్రమే పనిచేస్తాయి. ఈ వ్యాక్సిన్‌ ఇప్పటికే మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా దాటేసింది. మరో ఆరు నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 
(చదవండి: కరోనా పోరులో ట్రంప్‌ విఫలం)

జన్యుపరమైన అంధత్వానికి చెక్‌.. 
చిన్న తనంలోనే జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే అంధత్వాన్ని నయం చేసేందుకు అమె రికాలోని ఒరెగాన్‌ హెల్త్, సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు విజయం సాధించారు. లెబర్‌ కాంజెనిటల్‌ అమౌరోసిస్‌ అని పిలిచే ఈ వ్యాధిని క్రిస్పర్‌ అనే జన్యు ఎడిటింగ్‌ టెక్నిక్‌ సాయంతో నయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇది సమర్థంగా పనిచేస్తుందా అనే విషయం తెలుసుకునేందుకు మ రో నెల పట్టే అవకాశముందని వైద్యులు తెలిపారు. 

హెచ్‌ఐవీపై మరో విజయం  
లండన్‌కు చెందిన ఆడం కాస్టిల్లెజో అనే వ్యక్తి హెచ్‌ఐవీని జయించిన రెండోవ్యక్తిగా రికార్డుకెక్కాడు. సాధా రణ చికిత్స ఆపేసిన దాదాపు 30 నెలల తర్వాత కూడా ఇతడి రక్తంలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ ఆనవాళ్లు కన్పించలేదు. అయితే అతడికి సాధారణ హెచ్‌ఐవీ మందులు కాకుండా స్టెమ్‌ సెల్‌ చికిత్స చేశారట. 

ఇదీ మన మంచికే.. 
కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆరోగ్య వ్యవస్థల్లో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. మహమ్మారులు దాడిచేసినప్పుడు మన పరిస్థితి ఏమిటన్నది తెలియజేసింది. ఆరోగ్య రంగంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి.. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను మరింత వేగంగా, సమన్వయంతో, సమర్థవంతంగా 
ఎదుర్కొనడానికి ఈ అనుభవం దోహదపడుతుంది. 

– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

>
మరిన్ని వార్తలు