నిమిషానికి ఒకసారి ఆహారం తింటుంది!

10 Jul, 2016 11:26 IST|Sakshi
నిమిషానికి ఒకసారి ఆహారం తింటుంది!

పంగోలిన్‌ని తెలుగులో అలుగు, అలువ అని పిలుస్తారు. ఒంటి మీద పొలుసులతో చూడటానికి చిత్రంగా ఉంటాయి. వీటిలో మొత్తం 8 జాతులున్నాయి. నాలుగు జాతులు ఆసియాలో, నాలుగు జాతులు ఆఫ్రికాలో ఉన్నాయి. సవన్నా గడ్డి భూములు, గడ్డి మైదానాలు, ఇసుక, రాతి నేలలలో ఇవి నివసిస్తాయి. ఎక్కువగా వేటాడటం వలన వీటి మనుగడ ప్రమాద స్థాయిలో ఉంది. చైనా, ఆఫ్రికా దేశాల వారు వీటి శరీర భాగాలను రకరకాల మందులు తయారుచేయడానికి వినియోగిస్తారు. వీటి ప్రత్యేకమైన చర్మాన్ని రకరకాల ఫ్యాషన్‌ పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు. వీటి పొడవు దాదాపు 3.2 అడుగులు, బరువు 40 పౌండ్లు.

భారతదేశంలో ఉన్న అలుగులలో ఆడ, మగ అలుగులను తేలికగా గుర్తించవచ్చు. ఆడ అలుగు కంటే మగ అలుగు అధిక బరువు కలిగి ఉంటుంది. గట్టిగా ఉండే కెరటిన్‌తో వీటి వెంట్రుకలు, ఆ పైభాగం నిర్మితమై ఉంటుంది. నుదురు, పొట్ట, కాలి లోపలి భాగాలు మినహా, వీటి శరీరమంతా పొలుసులు పొలుసులతో కప్పబడి ఉంటుంది. వీటి ప్రతి పాదానికీ ఐదు గోళ్లుంటాయి. పదునుగా ఉన్న వీటి పంజాతో ఇవి బాగా తవ్వగలుగుతాయి. వెనుక కాళ్ల కంటే ముందు కాళ్లు పొడవుగా ఉంటాయి. గుండ్రంగా తిరిగే శక్తి ఉన్న తోక సహాయంతో ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకు దూకుతాయి. 6 అంగుళాల అతి పొడవైన జిగురు వంటి నాలుకతో క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఆ సమయంలో చిన్న చిన్న చీమలు ముక్కు, చెవులలోకి చొరబడకుండా, ముక్కు రంద్రాలు, చెవులను మూసుకుంటాయి.

తల్లి తోకే పిల్లలకు ప్రయాణ సాధనం!

ఇవి ఒక్క రాత్రి పూటే సుమారు 70 మిలియన్ల క్రిములను తినగలవు. రాత్రి సమయంలో సుమారు 90 సార్లు తింటాయి. కొన్నిసార్లు ప్రతి నిమిషానికి ఒకసారి తింటాయి. కేవలం 19 రకాల క్రిములను మాత్రమే తింటాయి. వీటికి దంతాలు లేని కారణంగా ఆహారాన్ని మింగేస్తాయి. వీటికి కళ్లు బాగా కనిపించవు. కాని వాసన మాత్రం పసిగట్టగలవు. 135 రోజుల గర్భం తరవాత బిడ్డకు జన్మనిస్తాయి. ఇవి చిన్నవిగా ఉన్నప్పుడు తల్లి వీటిని గుహలలో ఉంచుతుంది. ప్రమాదం జరగబోతున్నట్లు పసిగట్టగానే పిల్లను మరో గుహకు మార్చుతుంది. పిల్లలు తల్లి తోక మీద కూర్చుని ప్రయాణిస్తాయి.

 

మరిన్ని వార్తలు