ఆ కోరికే ఆమెకు మళ్లీ జీవం పోసింది

18 Aug, 2016 15:40 IST|Sakshi
ఆ కోరికే ఆమెకు మళ్లీ జీవం పోసింది

లండన్: నడవాలన్న బలమైన కోరిక ఒక్కటి ఉంటే చాలు చచ్చుబడిన శరీరానికి తిరిగి కదలిక తీసుకురావొచ్చంటారు. అచ్చం ఓ యువతి విషయంలో అదే జరిగింది. కొన్నేళ్లుగా కుర్చీకే పరిమితమైన జార్జియాకు చెందిన జాక్వీ గోంచెర్ అనే యువతి తన వివాహం రోజు అందరినీ ఆశ్చర్యపరిచేలా లేచి నిల్చోవడమే కాకుండా తన భర్తతో కలిసి మెల్లిగా అడుగులు వేస్తూ డ్యాన్స్ కూడా చేసింది. తాను పొందిన శిక్షణ ఆధారంగా కేవలం నిమిషాలు మాత్రమే అంతంత మాత్రం నిల్చోగలిగిన ఆమె ఏకంగా నాలుగు గంటలపాటు స్టేజీపై భర్తతో కలిసి నిల్చొని అందరినీ అబ్బురపరిచింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే.. తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన జాక్వీ అక్కడ స్విమ్మింగ్ పూల్ స్నానానికి దిగింది. ఆ క్రమంలో ఒక సారి డైవ్ చేసింది. అది కాస్త బెడిసి కొట్టి మెడ నరాలు దెబ్బతినడంతో ఆమెకు పక్షవాతంలాంటి పరిస్థితి ఎదురైంది. దాంతో జాక్వీ కుర్చీకే పరిమితం అయింది. అయితే, కొన్నాళ్లుగా వ్యక్తిగత ఫిజికల్ ట్రైనర్ ను తెప్పించుకొని ప్రతి రోజు కసరత్తులు చేసింది. ఆమెకు తన బోయ్ ఫ్రెండ్ కూడా బాగా సహకరించాడు. దీంతో ఆమె మెల్లిగా నిల్చోగల సామర్థ్యం పొందింది. అయితే అది కొద్ది నిమిషాలపాటే.

ఇటీవల ఆమెకు బోయ్ ఫ్రెండ్ తో పెళ్లి ఏర్పాట్లు చేయగా.. ఎలాగైనా తన భర్తతో కలిసి నడవాలన్న తాపత్రయంతో తల్లిని, స్నేహితురాలిని పిలిచి తనను నిల్చొబెట్టాలని కోరిన జాక్వీ అనంతరం అందరిని అబ్బురపరిచేలా తన భర్త వద్దకు మెల్లిగా అడుగులు వేస్తూ చేరింది. అతడి చేతిలో చెయ్యేసి సాల్సా డాన్స్కోసం స్టెప్పులు వేసింది. ఎలాగైనా నడవాలన్న బలమైన కోరిక ఆమె మనసులో ఉండటం వల్లే అది సాధ్యమైందని, దానికి తోడు ప్రియుడిపై మమకారం కూడా తనకు అదనపు బలంగా మారిందని ఆమె సన్నిహితులు చెప్పారు.