‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’

25 May, 2020 16:00 IST|Sakshi

కరాచీ: రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పైలెట్‌ తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తాము మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశామని.. కానీ పైలెట్‌ వాటిని పట్టించుకోలేదన్నారు. లాహోర్‌ నుంచి కరాచీకి ప్రయాణమైన ఎయిర్‌ బస్‌ ఏ-320 విమానం జిన్నా ఇంటరర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు 15 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉండగా ఏటీసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటికి భూమికి 7 వేల అడుగుల ఎత్తులో ఉండాల్సిన విమానం కాస్తా.. 10,000 అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు ఎత్తును తగ్గించాలల్సిందిగా పైలెట్‌ను హెచ్చరించారు. కానీ అతడు పట్టించుకోలేదు. (‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’)

తర్వాత విమానాశ్రయానికి 10 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు విమానం ఎత్తు 3 వేల అడుగుల ఎత్తులో ఉండాలల్సింది. కానీ అప్పుడు విమానం 7 వేల అడుగుల ఎత్తులో ఉంది. దాంతో ఏటీసీ అధికారులు మరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కానీ పైలెట్‌ మాత్రం ఏం పర్వాలేదని.. తాను హ్యాండిల్‌ చేయగలనని చెప్పాడు. సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ(సీఏఏ) ఇచ్చిన నివేదిక ప్రకారం పైలెట్‌ విమానాన్ని ల్యాండ్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంజన్‌ మూడు సార్లు రన్‌వేకు తగిలిందని.. దాంతో ఇంజన్‌ ట్యాంక్‌, పంపు దెబ్బతిన్నాయని పేర్కొంది. పైలెట్‌, ఏటీసీ ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిసస్థితి అదుపు తప్పిందని.. ఫలితంగా ప్రమాదం ఏర్పడిందని పాకిస్తాన్‌ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు)

ఇంధనం అయిపోవడం వల్ల ప్రమాదం సంభవించిందని ప్రచారం అవుతున్న వార్తల్ని కొట్టి పారేశారు. అంతేకాక విమానంలో సరిపడా ఇంధనం ఉందని అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న ఇంధనంతో దాదాపు 2.34 గంటల పాటు ప్రయాణించగలదని.. కానీ ప్రమాద సమయానికి కేవలం 1.30 గంటలపాటే ప్రయాణించిందని అధికారులు తెలిపారు. (ఆ విమానంలో లేను : నటి)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా