కోవిడ్‌-19: రోల్స్‌ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన

20 May, 2020 15:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఒక వైపు మానవ హననం, మరో వైపు ఆర్థిక సంక్షోభంతో కార్పొరేట్‌ దిగ్గజాలు సైతం అతలా కుతలమవుతున్నాయి. ఈ  నేపథ్యంలోనే యూకే ఇంజనీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ 9,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ ఆంక్షల సందర్భంగా తాము తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని,  ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తప్పలేదని తెలిపింది. తద్వారా 1.3 బిలియన్ డాలర్లను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెట్ ఇంజిన్ తయారీదారు ప్రకటించింది. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు)

విమాన ఇంజిన్‌లను తయారు చేసే డెర్బీ ఆధారిత సంస్థ రోల్స్‌ రాయిస్‌ కోవిడ్‌-19 సంక్షోభంతో విలవిల్లాడుతోంది. దీంతో మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 17వ వంతు కోతకు నిర్ణయించింది.  ఈ నిర్ణయం ప్రధానంగా తన సివిల్ ఏరోస్పేస్ విభాగాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఇది తయారీ సంక్షోభం కాకపోయినా, తాజా అనిశ్చితి, ఇతర సమస్యలను పరిష్కరించుకోవాల్సి వుందని సంస్థ సీఈవో బాస్ వారెన్ ఈస్ట్ అన్నారు. అయితే యూనియన్లతో సంప్రదింపుల కారణంగా ఉద్యోగ నష్టాలు ఎక్కడ ఉంటాయో కంపెనీ కచ్చితంగా తేల్చలేదు. ఉద్యోగ కోతల్లో ఎక్కువ భాగం ప్రధానంగా యూకేలోనే ఉంటుందని భావిస్తున్నారు. అలాగే  లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా సేవలను నిలిపివేసిన వైమానిక పరిశ్రమ కోలుకోవడానికి "చాలా సంవత్సరాలు" పడుతుందని హెచ్చరించింది. మరోవైపు ఈ నిర్ణయంపై అక్కడి కార్మిక యూనియన్లు మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు