ఎంత చెట్టుకంత కరెంటు..

4 Feb, 2016 02:27 IST|Sakshi
ఎంత చెట్టుకంత కరెంటు..

చెట్లు మనకు నీడనిస్తాయి.. ఆక్సిజన్‌ను ఇస్తాయి.. ఈ చెట్లయితే కరెంటును కూడా ఇస్తాయి! ఈ మధ్యే ఫ్రాన్స్‌లోని బ్రిటనీ నగరంలో దీని ప్రాథమిక నమూనాను ఒకదాన్ని ఏర్పాటు చేశారు కూడా.. 26 అడుగుల ఎత్తుండే ఈ విండ్ ట్రీలను ఫ్రాన్స్‌కు చెందిన న్యూవిండ్ సంస్థ డిజైన్ చేసింది. గాలి ఏ దిశ నుంచి వీస్తుంది అన్న సంబంధం లేకుండా.. ఎటు నుంచి వీచినా ఈ కృత్రిమ చెట్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయట. వీటి ఆకులు గాలిమరల్లా పనిచేస్తాయి.
 
సంప్రదాయ గాలిమరల్లా కాకుండా..  చిన్నపాటి గాలి వీచినా ఈ విండ్‌ట్రీలోని ఆకులు తిరుగుతూ పవన విద్యుత్‌ను తయారుచేసుకుంటాయని న్యూవిండ్ సంస్థ వ్యవస్థాపకుడు మిచాడ్ చెప్పారు. అసలు శబ్దమే చేయవని.. చూడ్డానికి అందంగా కనిపించడమే కాకుండా.. వీటిని రోడ్డు పక్కన లేదా పార్కుల్లో ఇలా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చంటున్నారు. తద్వారా వీధి దీపాలకు ఈ చెట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటునే వాడుకోవచ్చని మిచాడ్ తెలిపారు.భవిష్యత్తులో వీటిని ప్రజలు తమ ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో విండ్‌ట్రీ ధర రూ.23 లక్షలు.

>
మరిన్ని వార్తలు