2022 వరకు కరోనా ప్రభావం కొనసాగుతుంది!

2 May, 2020 17:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హెచ్చరించిన అమెరికా పరిశోధకులు

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావం 2022 వరకు కొనసాగుతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ప్రజల రోగనిరోధక వ్యవస్థ మరింత పటిష్టమయ్యేదాకా వైరస్‌ను నియంత్రించలేమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మిన్నెసోటా యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజ్‌ రీసెర్చ్‌ అండ్‌ పాలసీ పరిశోధకులు ఓ నివేదికను విడుదల చేశారు. ‘‘మహమ్మారి 18 నుంచి 24 నెలల పాటు ప్రభావం చూపుతుంది. హెర్డ్‌ ఇమ్యూనిటీ(దాదాపు 60- 70 శాతం మంది ప్రజలకు వైరస్‌ను తట్టుకునే శక్తి ఉండటం) పెంపొందినట్లయితేనే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా సాధారణ ఫ్లూ కంటే కోవిడ్‌-19 శరవేగంగా వ్యాపిస్తుందని... ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ ఎక్కువగా ఉండటం మూలాన ప్రాణాంతక వైరస్‌ లక్షణాలు త్వరగా బయట పడవు.. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.(లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇక అంతే: డబ్ల్యూహెచ్‌ఓ)

ఇక కరోనా నివారణకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేనందున భవిష్యత్తులో ఎదురుకాబోయే మరిన్ని తీవ్ర పరిణామాలకు అమెరికా సన్నద్ధంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరించారు. ఇక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షీషియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ ఆంటోనీ ఫౌసీ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా వైరస్‌ మరోసారి తప్పక విజృంభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా  కరోనా తీవ్రత తగ్గిన కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో పరిశోధకుల హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 2 లక్షల అరవై వేల మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 32 మిలియన్‌ మంది దీని బారిన పడ్డారు. ఇదిలా ఉండగా.. కరోనా ధాటికి ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్న తరుణంలో పలు దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి.(నివురుగప్పిన నిప్పులా వుహాన్‌)

మరిన్ని వార్తలు