'ఒంటరిగా ఎగిరిపోతే నా మనసు రోజూ...

25 Jul, 2015 16:04 IST|Sakshi
మసాన్ చిత్రంలో దీపా పాఠక్ పాత్రలో రిచా చడ్డా

ఈడొచ్చిన పిల్లల్లో సహజంగా ఉద్భవించే హార్మోన్ల వల్ల కలిగే భావుకత్వంతో కూడిన ఆలోచనలు.. అందుకు తగ్గట్టుగా మారే ప్రవర్తన..  తద్వారా ఎదురయ్యే పరిణామాలు.. ఆ అనుభవాలు వాళ్లను ఏ తీరాలకు తీసుకెళతాయనే..పరస్సర విరుద్ధ భావాల్ని సోకాల్డ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లుగా కాకుండా అంతరాత్మ ఉట్టిపడేలాంటి చిత్రాన్ని ఒకే కాన్వాసుపై చిత్రీకరిస్తే..

ఓపెనింగ్ సీన్..
అప్పటివరకు తనలోని అనైతికతను అణుచుకుంటూ వచ్చిన దీపా పాఠక్ అనే విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి లాడ్జి రూమ్కి వెళుతుంది. అక్కడ వాళ్లు ఏకాంతంగా ఉన్న సమయంలో (ఇద్దరున్నప్పుడు అది ఏకాంతమెలా అవుతుంది?)  పోలీసులు సీన్లోకి వస్తారు. ఇద్దరూ పట్టుబడతారు. ఏమీ జరగకపోయినా తమ తప్పును ఒప్పుకుంటారు. ఆ కన్ఫెషన్ సీన్ మొత్తాన్ని వీడియో తీసి దాచుకుంటాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఆ వీడియోతో అతడేం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదనుకుంటాం.

కానీ చెప్పుకోవాల్సిందే.. పోలీసుకు కావాల్సింది ఆ అమ్మాయి కాదు డబ్బు. పెద్ద మొత్తంలో డబ్బిస్తేగానీ ఆ వీడియోను, ఆమెపై ఉన్న కేసును కొట్టేయనని బెదిరిస్తాడు. ఎవరిని? అమ్మాయిని కాదు వాళ్ల నాన్నను. ఆ తండ్రి చేసేదీ మామూలు పనేమీకాదు.. కాశీలో బాగా డిమాండ్ ఉన్న 'కర్మకాండల పూజారి' పని. కూతురి మీద పడ్డ నిందను తుడిచేసుకునే క్రమంలో ఎంత సంపాదించినా సరిపోవట్లేదని భావించిన ఆ పూజారి.. అదనపు సంపాదన కోసం అప్పటికే బడి మానేసిన ఓ పదేళ్ల కుర్రాణ్నిఅసిస్టెంట్గా పెట్టుకుంటాడు.

.. మెడకు డోలన్నట్లు అసిస్టెంట్ని పెట్టుకుంటే సంపాదనెలా పెరుగుతుంది? పెరుగుతుంది. అంతే. అది కాశీ మరి. దేశంలో డబ్బున్న మారాజులందరూ కర్మకాండలకు అక్కడికే వస్తారు. వేల రూపాయల నాణాలను గంగకు సంతర్పణం చేస్తారు. నది అడుగు భాగానికి వెళ్లి ఆ నాణాలను వెతికి తీసుకురావడమే అసిస్టెంట్ పని. అలా నాణాల కోసం వెళ్లి చనిపోయేవారి సంఖ్య తక్కుమేమీకాదు. అయినాసరే కూతురి కోసం అసిస్టెంట్ కుర్రాడి జీవితాన్ని రిస్కులో పెట్టక తప్పదు ఆ తండ్రిగారికి. ఏంటిదంతా? అడుసు తొక్కనేల? కాలు కడగనేలా? అనుకునే అవకాశం ప్రేక్షకుడికి రానేరాదు ఎందుకంటే..

చైతన్య స్రవంతి (స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్) ని కళ్లతో చూడగలమా? అది సాధ్యమేనా? అనే ప్రశ్నకు చాలా ఏళ్ల తర్వాత దొరికే లేదా దొరికిన సమాధానం 'మసాన్'. సహజంగానే విరుద్ధ స్వభావానికి దగ్గరిగా పరుగెత్తే మనుషులకు.. అలా మారిపోయే ప్రక్రియను మరింత సులభతరం చేసిన నేటి సామాజిక, సాంకేతిక పరిస్థితులను ఒడిసిపట్టడం.. వంద ఆలోచనల్ని ఒక్క కాన్వాసుగా గీసినంత పని. ఆ పనిని తన మొదటి సినిమాలోనే అత్యద్భుతంగా చేసి చూపాడు దర్శకుడు నీరజ్ ఘవాన్. ఈ సినిమాకు ముందు ఆయన అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు.

రోడ్డుకు ఎడమవైపు కేవలం ఆభరణాలు మాత్రమే ధరించి వనిత ఫుల్ సైజ్ ఫ్లెక్సీ .. రోడ్డు మధ్యలో డివైడర్ మీద సిక్స్ ప్యాక్ ఇలా అంటూ చెడ్డీ మీద నించున్న స్మార్ట్ గైయ్ యాడ్. తల పైకెత్తి చూస్తే 'పైకి రా' అనే టైటిల్తో U/A సినిమా పోస్టర్. అన్ని చోట్లా ఒలికేది శృంగార రసమే. ఇక చేతిలో సెల్ ఫోన్లయితే ఆ రసాన్ని మరింతగా ఒలికించగలిగే సాధనం. నైతికతను కనీసం గుర్తుచేయకుండా ఉంచగలిగేంత టెక్నాలజీ సిగ్నళ్ల మధ్య అనైతికంగా ఉండొద్దనే ఉద్భోదకు ఫ్రీక్వెన్సీ తక్కువ. మ్యాగ్నిట్యూడ్.. హ్యూమనిట్యూడయితే అసలు ఉండనే ఉండవు. ఇంత గందరగోళంలో యువతరం ఎలా మనగలుగుతోంది? తన భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటోంది? తనను తాను ఎలా మౌల్డ్ చేసుకుంటున్నారు? ఇలాంటి మౌలికమైన భారీ ప్రశ్నలకు అత్యల్ప (కేవలం రెండు గంటల్లో) సమయంలో సమాధానం చెప్పేందుకు చేసిన ప్రయత్నమే 'మసాన్'.

తర్వాతి కథ..
చదువు పూర్తయిన తర్వాత దీపకు రైల్వే బుకింగ్ క్లర్క్ ఉద్యోగం వస్తుంది. ఓ రోజు ఆమె బుకింగ్ కిటికీ ముందు నిల్చుని ఓ అబ్బాయి-అమ్మాయి జంట ఏదైనా చోటుకు పోయి, రాత్రికి కలసి గడపాలని రెండు టికెట్లు అడుగుతారు. అది చూసి దీప బిర్రబిగుసుకుపోతుంది. అసమ్మతి పూర్వకమైన ఆమె కళ్లు మానిటర్‌ను చూసే సరికి 26 ఖాళీ సీట్లు కనిపిస్తుంటాయి. కానీ ఆమె వారికి లేవని చెబుతుంది. ఎందుకంటే రెండు గంటలపాటు ఒక బాయ్‌ఫ్రెండ్‌తో తను సన్నిహితంగా గడిపితే, ఆ తర్వాత ఎంతటి అపనిందలు, వేధింపులకు గురి కావాల్సి వస్తుందో ఆమెకు తెలుసు.

మరోవైపు..
నాణానికి రెండు వైపులున్నట్లు.. చావు పుట్టుకలు కాశీ మనుగడకు కీలక ఆధారాలు. దివ్య కథతోపాటే షాలూ గుప్తా, దీపక్ కుమార్ల కథా సమాంతరంగా నడుస్తూ ఉంటుంది. కాశీ ఘాట్లలో శవాలను తగలబెట్టే వృత్తిపని చేసేవాళ్లను 'డోమ్' అంటారు. ఆ కులానికి చెందిన దీపక్ కుమార్ (విక్కీ కౌశల్) ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతుంటాడు. ఉన్నత వర్గానికి చెందిన శాలూ గుప్తాతో ప్రేమలో పడతాడు. నిజానికి దీపక్ ప్రేమలో ఉన్నాడు అనేకంటే ఆత్మన్యూనతలో ఉంటాడని ఇట్టే అర్థమవుతుంది మనకు.

'నేను కాల్చే శవాలతోపాటే నా మనసూ రోజూ కాలిపోతూ ఉంటుంది' అని శాలూకు చెప్తూంటాడు. ఈజీ గోయింగ్ క్యారెక్టర్ లా అనిపించే శాలూ మాత్రం ఇవేవీ పట్టించుకోదు. 'పారిపోవడం తప్పుదుకదా.. అప్పుడు తప్పకుండా పారిపోదాం' అని దీపక్ తో అంటుంది. ఇది ప్రేమా? లేక అనైతికత రుచి కోసం ఎంత రిస్క్ అయినా భరించాలనుకునే హార్మోన్ల ప్రభావమా? అనే మానసిక సంఘర్షణను తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు నీరజ్.

దీప పాత్రలో రిచా చద్దా, పురోహితుడిగా ఆమె తండ్రి విద్యాధర్ పాఠక్ పాత్రలో సీనియర్ నటుడు సంయన్ మిశ్రా, వల్లకాట్లో పనిచేస్తూ ఇంజనీరింగ్ చదివే దీపక్ కుమార్ పాత్రలో విక్కీ కౌషల్, శాలూ గుప్తాగా శ్వేతా త్రిపాఠి అభినయం అవార్డులతోపాటు ప్రేక్షకుల హృదయాలూ గెల్చుకునే స్థాయిలో ఉంటుంది. ఇవికాకుండా ఇన్ స్పెక్టర్ సహా కేవలం తొమ్మిది లేదా పది క్యారెక్టర్లతో బిగుతైన స్క్రీన్ ప్లే రాసుకుని, అనుకున్నట్లే తెరకెక్కించాడు దర్శకుడు నీరజ్ ఘవాన్. 'మసాన్' అంటే అర్థం 'ఒంటరిగా ఎగిరిపో' అని.