నేను లూజర్‌ని కాదు.. ఫైటర్‌ని

5 Jul, 2019 00:37 IST|Sakshi
ఆది సాయికుమార్‌, డైమండ్‌ రత్నబాబు

‘‘కంటెంట్‌ ఉన్న సినిమాలను ఎవ్వరూ ఆపలేరు. మార్నింగ్‌ షోకే బాగుందని టాక్‌ వస్తే ఆ సినిమా హిట్టే. ‘ఏజంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమానే తీసుకోండి. మార్నింగ్‌ షో తర్వాత అన్ని చోట్లా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇలా బాగున్న సినిమాలన్నీ ఆడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఆది సాయికుమార్‌. డైమండ్‌ రత్నబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశాలు నాయకా, నాయికలుగా శ్రీకాంత్‌ దీపాల, కిషోర్, కిరణ్‌రెడ్డి నిర్మించిన ‘బుర్రకథ’ నేడు విడుదలదవుతోంది. ఆది సాయికుమార్‌ చెప్పిన విశేషాలు.

► ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి ‘బుర్రకథ’లోది చాలెంజింగ్‌ రోల్‌. ఒక మనిషికి రెండు బుర్ర లుంటే ఏ విధంగా నడుచుకుంటాడు? అనేది కథ. ఇలాంటి పట్టున్న క్యారెక్టర్స్‌ చేస్తేనే మనలో ఉన్న నటుడికి సరైన టెస్ట్‌. అందుకే చాలెంజ్‌ అన్నాను. రెండు బుర్రలున్న మనిషి కథ. రెండు క్యారెక్టర్లు చాలా కష్టపడి చేశాడు ఆది అనుకోకూడదు. చాలా ఈజీగా ఈజ్‌గా చేశాడే అనుకోవాలి. ఆ పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది.

► జనరల్‌గా నా సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటే నా పాత్రలు ఉంటాయి. ఉదాహరణకు నా గత చిత్రాలు ‘ప్రేమకావాలి’, ‘లవ్‌లీ’లను అబ్జర్వ్‌ చేస్తే కావాలని నేను కామెడీ చేయను. కథలోనే ఉంటుంది. ఈ సినిమాలో రత్నబాబు ఆ కామెడీ పాళ్లు కొంచెం పెంచారు. కొన్ని కొన్ని సీన్స్‌ ఎలా పండుతాయో, థియేటర్‌లో ఆడియన్స్‌ ఎలా ఫీల్‌ అవుతారో చూడాలని వెయిట్‌ చేస్తున్నాను.

► నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్‌ పాయింట్‌ ఉంటుందని చెప్పగలను. ఉదాహరణకు నా మూడోసినిమా ‘సుకుమారుడు’. అందులో కొంచెం గ్రే షేడ్‌తో ఉండే పాత్ర నాది. అందరూ ఆ సినిమా చేసేటప్పుడు లవర్‌బాయ్‌ పాత్రలు చేసుకోవచ్చు కదా అన్నారు. ‘ఒకే రకమైన పాత్రలు ఎందుకు?’ అన్నాను. నాలోనూ నటుడున్నాడు, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. సినిమా ఫెయిల్‌ అయ్యింది. అందరూ నువ్వు బాగానే నటించావు అన్నారు.

అదే సినిమా హిట్‌ అయ్యుంటే అందరూ నా చాయిస్‌ కరెక్ట్‌ అనేవారు. కానీ సినిమా ఫెయిల్‌ అవటంతో మరో ప్రయోగం చేసే అవకాశం లేకుండా పోయింది. అందరూ లవర్‌బాయ్‌గా చేయమంటే ‘ప్యార్‌ మే పడిపోయానే’ సినిమా చేశాను. అలాగే ‘గాలిపటం’ మంచి సబ్జెక్ట్‌. మధ్యలో కొన్ని కమర్షియల్‌ సినిమాలు చేశాను. ఆ సినిమాలు కమర్షియల్‌గా బాగానే పే చేశాయి. వాటిలో ‘రఫ్‌’, ‘చుట్టాలబ్బాయి’ బాగా వసూలు చేశాయి. ‘శమంతకమణి’ సినిమాతో మళ్లీ ఓ ఎక్స్‌పెరిమెంట్‌ చేశాను. అది చాలా మంచి పేరొచ్చింది.

► ‘బుర్రకథ’ సినిమా ద్వారా ఇప్పుడు చాలా పెద్ద పేరొస్తుంది, ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. ప్రతి మనిషిలోనూ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి లూసర్, రెండోది ఫైటర్‌. లూసర్‌ కిందపడగానే ఓడిపోయాను అని వెళ్లిపోతాడు. కానీ, నేను లూసర్‌ని కాదు ఫైటర్‌ని. కిందపడ్డా లేచి పరిగెత్తాలి, రేసులో నిలవాలి అనే ఫైటర్‌ను నేను.

► ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ సినిమా కంప్లీట్‌ అయ్యింది కానీ, కొంచెం సీజీ బ్యాలెన్స్‌ ఉంది. మరో రెండు నెలల్లో రిలీజ్‌ చేస్తాం. ఇవికాక ‘జోడీ’ అనే కంప్లీట్‌ ఫ్యామిలీ క్యూట్‌ లవ్‌స్టోరీ చేస్తున్నాను. అందులో ఒక్క ఫైట్‌ కూడా ఉండదు. తమిళ్, తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్‌  హారర్‌ థ్రిల్లర్‌ చేస్తున్నా. ఇవికాక సాయిరాజ్‌ అనే నూతన దర్శకునితో చేయబోతున్న చిత్రం షూటింగ్‌ ఆగస్ట్‌లో మొదలవుతుంది.

లక్ష్యం నెరవేరింది
‘‘హాస్యానందం’ పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేశా. ఆ తర్వాత రచయితగా, ఇప్పుడు డైరెక్టర్‌ స్థాయికి ఎదిగా. ఒక సెల్‌లో రెండు సిమ్‌లు ఉన్నప్పుడు ఒక మనిషిలో రెండు మైండ్‌లు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘బుర్రకథ’’ అని ‘డైమండ్‌’ రత్నబాబు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ కావాలనే లక్ష్యంతో వచ్చాను. ‘బుర్రకథ’ సినిమా ఓపెనింగ్‌ రోజు నా లక్ష్యం నెరవేరిందని చేతికి ‘డైరెక్టర్‌’ అని పచ్చబొట్టు వేయించుకున్నా. చిన్న నిర్మాతలను దర్శకుడు కాపాడుకోవాలి. మార్కెట్‌ని బట్టి బడ్జెట్‌ పెడితేనే నిర్మాతలకు లాభం ఉంటుంది.

50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తానని నిర్మాతకు మాటిచ్చా.. 46 రోజుల్లోనే పూర్తి చేశా. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో నేనే రెండు పాటలు కూడా రాశా. రామాయణం, మహాభారతం, పరిసరాల స్ఫూర్తితో కథలు రాసుకుంటా. హాలీవుడ్‌లో రచయితకి మంచి పారితోషికం ఉంటుంది. టాలీవుడ్‌లో డైరెక్టర్‌కి  ఉంటుంది. నా రెండో సినిమాగా ‘బుర్రకథ’నే తమిళ్, హిందీలో రీమేక్‌ చేసే చాన్స్‌ ఉంది. మూడో సినిమాగా మోహన్‌బాబుగారి ఫ్యామిలీకి సరిపడే కథ రెడీచేశా. ఆయన చాన్స్‌ ఇస్తే చేస్తా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా