పార్టీకి, ఫ్యామిలీకి సంబంధం లేదు : నాగబాబు

21 May, 2020 09:58 IST|Sakshi

హైదరాబాద్‌ : నాథూరాం గాడ్సే  దేశభక్తిని శంకించలేమని సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి నాగబాబుపై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తన ట్వీట్‌కు సంబంధించి నాగబాబు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా తాను చేసే ట్వీట్లకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని నాగబాబు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.(చదవండి : నాగబాబుపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు)

‘నేను ఏ అంశంపై ట్వీట్ చేసినా.. అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబ సభ్యులకుగానీ నా అభిప్రాయాలలో ఎటువంటి ప్రమేయం లేదు’ అని పేర్కొన్నారు. కాగా, గాడ్సే పుట్టిన రోజున నాగబాబు చేసిన ట్వీట్‌ వివాదస్పదం కావడంతో ఆయన వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాథూరాం గురించి ఇచ్చిన ట్వీట్ లో అతను చేసిన నేరాన్ని సమర్థించలేదు.నాథూరాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అని పేర్కొన్నారు.(చదవండి : గాడ్సే నిజమైన దేశభక్తుడు)

మరిన్ని వార్తలు