హీరో స్వయంవరం.. సెన్సార్‌బోర్డుకు నోటీసులు

22 Mar, 2018 14:35 IST|Sakshi
ఎంగ వీటు మాపిల్లైలోని ఓ దృశ్యం

సాక్షి, చెన్నై : కోలీవుడ్‌ ఓ రియాల్టీ షో కోర్టు మెట్లెక్కింది. నటుడు ఆర్య స్వయంవరం పేరిట ఈ షోను నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలను ఎంపిక చేసి ఇందులో గెలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడంటూ ఈ షోను నిర్వహిస్తున్నారు. అయితే దీనిని నిలిపివేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. షో నిర్వాహకులతోపాటు  సెన్సార్‌బోర్డుకు కోర్టు నోటీసులు దాఖలు చేసింది.

‘ఎంగ వీటు మాపిల్లై’ పేరిట ఆర్య తన స్వయంవరం షోను ప్రకటించాడు. కలర్స్‌ తమిళ్‌  ఛానెల్‌లో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. నటి సంగీత ఈ రియాల్టీ షోకు హోస్టింగ్‌ చేస్తున్నారు. అయితే ఈ షో మహిళల గౌరవానికి దెబ్బతీసేలా ఉంటోందని.. పైగా కంటెస్టెంట్‌లను కించపరిచేలా షోలో పనులు చేయిస్తున్నారంటూ జానకిఅమ్మల్‌ అనే ఉద్యమకారిణి ఆరోపణలకు దిగారు. ఈ మేరకు షోను నిలుపుదల చేయాలంటూ ఆమె సెన్సార్‌ బోర్డు, కేంద్ర సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

విచారణకు స్వీకరించిన మధురై బెంచ్‌.. షో నిర్వాహకులకు, సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శితోపాటు, ఈ షోకు అసలు అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ సెన్సార్‌ బోర్డుకు నోటీసులు దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌ 18కు వాయిదా వేసింది. అయితే అప్పటిదాకా షో నిర్వాహణను నిలుపుదల చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది.

మరిన్ని వార్తలు