మనం ఇంట్లో ఉంటే.. వారు మాత్రం..: మహేశ్‌బాబు

16 Apr, 2020 13:44 IST|Sakshi

క‌రోనా వైరస్‌పై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు ట్వీట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా వీరికి తన వంతు మద్దతు తెలిపాడు. ఇప్పటికే  వైద్యులు, పోలీసుల సేవలను కీర్తిస్తూ ట్వీట్‌ చేసిన మహేశ్‌.. తాజాగా కరోనా వైరస్‌ను పారదోలేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై  ప్రశంసల జల్లు కురిపించారు. మనం సురక్షితంగా ఇంట్లో ఉంటుంటే, వారు మాత్రం ప్రతి రోజు బయటకు వచ్చి మన కోసం పని చేస్తున్నారని కొనియాడాడు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన పలు ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ పలు ట్వీట్లు పెట్టారు. 
(చదవండి : మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు)

‘మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్న వారికోసం ఈ ట్వీట్. మనం అంతా ఇంట్లో సురక్షితంగా ఉంటే వారు మాత్రం బయటకు వచ్చి పని చేస్తున్నారు. ప్రమాదాలు మన దరి చేరకుండా చూస్తున్నారు. ప్రాణాంతక వైరస్‌పై పోరాటంలో ముందు వరసులో నిలబడి మన కోసం యుద్దం చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి పట్ల గౌరవం, ప్రేమ, వారికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుంది’ అని ట్వీట్‌ చేశారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న మహేశ్. ప్రస్తుతం క్వారంటైన్‌ సమయాన్ని కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. తర్వాతి చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం జరుతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం మహేశ్‌ తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న జరగనుందట.

మరిన్ని వార్తలు