గేమ్‌ మారిపోయింది

2 Jun, 2020 03:48 IST|Sakshi

‘‘ఒక సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో బాగుందని టాక్‌ వస్తే మూడోవారం నుంచి వసూళ్లు పెరిగే రోజులు గతంలో ఉండేవి. కానీ ఈ గేమ్‌ మారిపోయింది. ఇప్పుడు వారాలు కాదు... త్రీ డేస్‌ గేమ్‌ అయిపోయింది. సినిమా శుక్రవారం విడుదలైతే, ఆ శుక్రవారం, శనివారం, ఆదివారం ఎంత గ్రాస్‌ వస్తుందో చూస్తున్నారు. ఆ తర్వాత సినిమా బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్‌ నామా అన్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ వంద సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఈ ప్రయాణంలోని విశేషాలను హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్‌ నామా ఇలా చెప్పుకొచ్చారు.

► 19 ఏళ్ల వయసులో ‘హ్యారీ పోటర్‌’ (తెలుగులో)తో డిస్ట్రిబ్యూషన్‌ మొదలు పెట్టాను. దాదాపు 17 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను బాగా ఆడతాయనుకున్న సినిమాలు ఆడని సందర్భాలు ఉన్నాయి. అలాగే రిలేషన్‌ కోసం నేను అంగీకరించిన సినిమాలు ఉన్నాయి. అయితే ఏ విషయంలోనూ తొందరపడకూడదని నా ఈ జర్నీలో నేర్చుకున్నాను. డిస్ట్రిబ్యూషన్‌ పరంగా థియేటర్స్‌ కొరతతో ఇప్పటివరకు నేను ఇబ్బంది పడింది లేదు. 

► కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసినప్పుడు అవి హిట్‌ సాధిస్తే అందులో మంచి కిక్‌ ఉంటుంది. స్టార్‌ హీరోస్‌ సినిమాల ఓపెనింగ్స్‌  వసూళ్లు ఎలా ఉంటాయో అందరికీ ఎలాగూ ఓ అంచనా ఉంటుంది. ‘కుమారి 21 ఎఫ్, జార్జిరెడ్డి, 2012’ వంటి సినిమాలను మా సంస్థలో డిస్ట్రిబ్యూట్‌ చేశాం. ‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ కమర్షియల్‌ బ్లాక్‌బాస్టర్‌ను చూశాం.

► సినిమా చూశామన్న రియల్‌ ఫీల్‌ కావాలంటే థియేటర్స్‌కు వెళ్లడమే. సినిమాలకు ఇప్పుడు శాటిలైట్‌ మార్కెట్‌ ఎలా అయితే ఉంటుందో, ఓటీటీలకు కూడా అలా ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ ఉంటుంది. అంతే కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ థియేటర్స్‌ను ప్రభావితం చేయలేవనే అనుకుంటున్నాను. ఒకసారి థియేటర్స్‌ ఓపెన్‌ అయితే ప్రేక్షకులు బాగానే వస్తారనే నమ్మకం ఉంది. సినిమా లవర్స్‌ థియేటర్స్‌కు వస్తారు. ∙కరోనా కారణంగా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో మార్పులేవి రావనే అనుకుంటున్నాను. రెండు, మూడు నెలల్లో షూటింగ్స్‌ తిరిగి ఆరంభం కావొచ్చు. నిర్మాణపరంగా దర్శకుడు సుధీర్‌వర్మతో ఓ సినిమా ఉంది. మరో రెండు,మూడు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు