గాల్లో తేలినట్టుందే...

2 Aug, 2013 01:07 IST|Sakshi
గాల్లో తేలినట్టుందే...
 ‘‘సోలో, నువ్వా నేనా తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న మూడో చిత్రం ఇది. యూత్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడు కథ ఎంత బాగా చెప్పాడో అంతే బాగా తీశాడు. ఈ నెల రెండో వారంలో పాటలను, నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. అజయ్, కౌసల్య, నవీన్, అభిరాం ముఖ్య తారలుగా చొక్కాకుల వెంకట్రావ్‌తో కలిసి వెంకట్ సురేష్ గుణ్ణం దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. 
 
 దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ విన్న వెంటనే వంశీకృష్ణ అవకాశం ఇచ్చారు. టిక్కెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికీ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది’’ అన్నారు. మంచి సినిమా నిర్మించామని, తదుపరి పవర్ మూవీస్ అనే సంస్థ ప్రారంభించి, సినిమా తీయనున్నానని చొక్కాకుల చెప్పారు. మంచి పాటలు కుదిరాయని సంగీతదర్శకుడు సాయికార్తీక్, మంచి పాత్రలు చేశామని అజయ్, నవీన్, అభిరాం చెప్పారు. పోసాని కృష్ణమురళి, రఘుబాబు, కృష్ణభగవాన్, చెల్లూరి అర్జున్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శీలం లక్ష్మణ్, విల్లూరి భాస్కర్‌రావు.