షూటింగ్లో గాయపడిన యో యో హనీసింగ్

20 Aug, 2014 16:09 IST|Sakshi
షూటింగ్లో గాయపడిన యో యో హనీసింగ్

యో యో హనీసింగ్.. ఈ పేరు చెబితే చాలు.. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవయసు వాళ్ల వరకు అందరూ ఊగిపోతుంటారు. అలాంటి హనీసింగ్ 'ఇండియాస్ రా స్టార్' అనే టీవీ రియాల్టీ షో షూటింగ్లో గాయపడ్డాడు. ఈ కార్యక్రమం షూటింగ్ చేస్తుండగా జారిపడిపోయి గాయపడ్డాడు. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ షూటింగ్ చేస్తుండగా చిట్ట చివరి బిట్ షూట్ చేసేటప్పుడు జారి కింద పడిపోయాడని ఈ షో నిర్మాణ వర్గాలు తెలిపాయి.

కింద పడినప్పుడు అతడికి స్వల్ప గాయాలయ్యాయని, అయినా ఏమాత్రం గొడవ చేయకుండా వెంటనే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేశాడని చెప్పాయి. 'ఇండియాస్ రా స్టార్' షోలో పోటీ చేసేవాళ్లకు హనీసింగ్ ఓ స్నేహితుడిగా, మెంటార్గా, మార్గదర్శిగా కనిపిస్తాడు. దేశవ్యాప్తంగా వచ్చిన గాయనీ గాయకులు ఈ టైటిల్ కోసం పోటీ పడుతుంటారు. దీనికి హోస్ట్గా ప్రముఖ మోడల్, నటి గౌహర్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఆదివారాలు స్టార్ ప్లస్ ఛానల్లో ఈ షో ప్రసారం అవుతుంది.