స్నేహంతో స్పృశిస్తాం.. ప్రేమలతో తరిస్తాం..

25 Nov, 2017 09:10 IST|Sakshi

పెంపుడు జంతువులతో నగరవాసి మమేకం

ఒత్తిడిని దూరం చేసేవి.. ఆనందం పంచేవి అవే..

కుటుంబ సభ్యులతో సమాన గౌరవం 

నేడు జాతీయ జంతు సంరక్షణ దినోత్సవం

ఎక్కడి నుంచి తెచ్చావ్‌.. ఈ కుక్కపిల్లను..! అనడిగితే చాలా మందికి కోపమొస్తుంది. ‘ఇది కుక్కపిల్ల కాదు.. మా రీనా. మా ఫ్రెండ్‌’ అంటూ ఘాటుగా సమాధానమిస్తారు. కుక్కపిల్లనో.. పిల్లి అనో పిలిస్తే వారు ఒప్పుకోరు. ఇది కాస్త చాదస్తంగా.. అనిపించినా నగర జీవనంలో ఇప్పుడు చాలామంది తమ పెంపుడు జంతువుల విషయంలో ఇలానే ఉంటున్నారు. ఈ పద్ధతి కుక్కపిల్లకే పరిమితం కాలేదు.. అన్ని జంతువుల విషయంలోనూ ఇలానే ఉంది. వాటికి రూ.లక్షలు ఖర్చుపెట్టి పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. చనిపోతే రిచ్‌గా సమాధులు కట్టించేవారూ ఉన్నారు. పెంపుడు జంతువులపై నగరవాసి పెంచుకున్న ప్రేమకు ఇది నిదర్శనం. నేడు జాతీయ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

నగరంలో జంతుప్రేమకుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే పెద్దవారికి తోడుగా ఉంటాయనే ఆలోచన నుంచి యువత తమ తోటి స్నేహితులుగా పలు రకాల జంతువులను, పక్షులను ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా కలవర పడుతున్నారు. జంతువులు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను పంచుతున్నాయి. ఇటీవలి కాలంలో చాలా సోషల్‌ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫొటోలు ఇందుకు ఉదాహరణగా నిలిస్తున్నాయి.

జంతు సంరక్షణలో సంస్థలు..
ఏ జంతువైనా సరే మనతో కలిసి జీవించే హక్కు ఉందంటున్నారు జంతు ప్రేమికులు. అందుకే వాటి సంరక్షణ కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి హక్కుల కోసం పోరాడుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని బ్లూక్రాస్‌ సంస్థ దాదాపు 24 ఏళ్లుగా జంతు సంరక్షణ సేవలందిస్తోంది. ఇక్కడి సభ్యులు ఇప్పటి వరకు దాదాపు 4 లక్షలకు పైగా జంతువులను కాపాడారు. వాటికి అవసరమైన వైద్యం అందించి ప్రాణం పోశారు. మరో 1,22,480 పక్షులను కాపాడడంతో పాటు 12,805 జంతువులను దత్తత తీసుకొన్నారు. ఈ ఉద్యమాన్ని బ్లూక్రాస్‌ హైదరాబాద్‌ నిర్వాహకురాలు అక్కినేని అమల 1992 నుంచి చేస్తున్నారు. ఈ సంస్థనే కాకుండా స్నేక్‌ సొసైటీలు, జంతు సంరక్షణ సంస్థలు నగరంలో చాలానే ఉన్నాయి. ఎవరన్నా జంతువులు, పక్షులను బాధపెట్టేలా ప్రవర్తించినా, గాయం చేసినా వారికి శిక్ష వేయించేలా కృషి చేస్తున్నారు.  

మరో ప్రపంచంలో ఉన్నట్టే..  
నా వద్ద పది కుక్కలున్నాయి. ఇంట్లో ఉన్నంత సేపూ వాటితోనే గడుపుతుంటా. వాటితో ఉన్నంత సేపూ మరో ప్రపంచంలో ఉన్నట్టు ఆనందంగా ఉంటుంది. ఆ ప్రాణులుకు ఏమన్నా జరిగితే అస్సలు తట్టుకోలేను. తగ్గేవరకు మనసు మనసులో ఉండదు.     – పూరీ జగన్నాథ్‌   

ఒత్తిడిలో పెద్ద రిలీఫ్‌ అవే..
ఒక్క జంతు సంరక్షణ దినోత్సవం నాడేకాదు.. జంతువులను ప్రతిరోజు ప్రేమగా చూడాలి. ఆ మూగ జీవాలను అర్థం చేసుకోవాలేగాని హాని చేయకూడదు. నా వద్ద రెండు పిల్లులు ఉన్నాయి. వాటిని చూస్తే చాలు నాకు పెద్ద రిలీఫ్‌గా ఉంటుంది.     – సదా

గుండెల నిండా ప్రేమ..
హీరో రాజ్‌తరుణ్‌కు కుక్కపిల్లలంటే చాలా ప్రేమ. ఈ మధ్య అతను ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కపిల్ల ఒక్కటి మృత్యువాతపడింది. దీంతో దాదాపు వారం రోజులపాటు కోలుకోలేకపోయాడు. బేగంపేటలో మరో కుటుంబం ముద్దుగా పెరిగిన శునకం కన్నుమూస్తే ఇంటిల్లిపాది కన్నీరుమున్నీరయ్యారు. ప్రత్యేకంగా దహన సంస్కారాలు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లో ఓ పెంపుడు కుక్కపిల్ల అదృశ్యమవడంతో దాని యజమాని నిద్రాహారాలు మాని పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగాడు. చివరికి సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కుక్కపిల్లను దొంగిలించిన నిందితుడిని పట్టుకున్నారు. దానిని తిరిగి అప్పగించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. చాలా సంఘటనల్లో ఇప్పుడు తమ పెంపుడు జంతువులకు ప్రత్యేక స్థానం ఇస్తున్నారు. వాటికి ముద్దు పేర్లు పెట్టుకోవడమే కాకుండా ఎవరైనా వాటిని పేరుతోకాకుండా మరొలా పిలిస్తే గొడవకు దిగుతున్నారు. జంతువులపై తమ అనంతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారు.

తారల ఇంట అనుబంధం..
కొన్ని నెలల క్రితం తెలుగు ఇండస్ట్రీకి చెందిన రవిబాబు పందిపిల్లతో ఓ ఏటీఎం క్యూలైన్‌లో నిలబడి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. సినిమా కోసం ఇది చేసినా.. దానిని తాను పెంచుకుంటున్నట్లు చెప్పారు. ఇక రాంచరణ్‌ వద్ద పదుల సంఖ్యలో గుర్రాలు, కుక్కలు, ఒంటె వంటి జంతువులు, కోడి పుంజుతో సహా పక్షులే ఉన్నాయి. హీరో రాజ్‌తరుణ్‌కు కుక్కపిల్లలంటే పిచ్చిప్రేమ. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన వద్ద దేశవిదేశీ పక్షులు, జంతువులు చాలానే ఉన్నాయి. అమితాబ్‌ బచ్చన్, సల్మాన్‌ఖాన్, నాగార్జున, ప్రభాస్, త్రిష, అనుష్క, సోనమ్‌ కపూర్‌.. ఒకరేమిటి.. టాలీవుడ్, బాలీవుడ్‌ ప్రముఖులు షూటింగ్‌లు మినహాయిస్తే ఎక్కువ సమయాన్ని తమకు ఇష్టమైన జంతువులు, పక్షులతోనే గడుపుతున్నారు. 

మరిన్ని వార్తలు