కృష్ణవంశీని ఆకాశానికెత్తిన కమలినీ

1 Oct, 2014 18:44 IST|Sakshi
కమలినీ ముఖర్జీ

చెన్నై: 'ఆనంద్‌' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ దర్శకుడు  కృష్ణవంశీని పొగడ్తలతో ఆకాశానికెత్తారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించేసుకుని, ఆ తరువాత 'గోదావరి' సినిమాతో మరింత దగ్గరైన కమలినీ  తాజాగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో నటించింది. ఇటువంటి కుటుంబ కథా చిత్రంలో నటించినందుకు గర్వపడ్తున్నాననీ కమలినీ  చెప్పారు. ఈ చిత్రంలో నటించడం ద్వారా గొప్ప అనుభూతి పొందినట్లు పేర్కొన్నారు. కుటుంబ సంబంధాలు, మనుషులలో భావోద్వేగాలు, వారి మనస్తత్వాలు తెలియజేయడంలో  కృష్ణవంశీ దిట్ట అన్నారు.

కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్చరణ్-కాజల్ జంటగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ఈరోజు విడుదలైన సందర్భంగా కమలినీ  ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఓ కుటుంబంలా కలిసిమెలిసి పనిచేసినట్లు చెప్పారు. తన కెరీర్లో దీర్ఘ కాలం 8 నెలలు షూటింగ్ చేసిన చిత్రం ఇదేనన్నారు. షూటింగ్ జరిగినంత కాలం చాలా ఆనందంగా గడిచిపోయినట్లు తెలిపారు. ఈ చిత్రం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందన్నారు.

కృష్ణ వంశీ కెరీర్లో ఇది ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు. కుటుంబ కథా చిత్రాలు నిర్మించడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని ప్రశంసించారు. తన కెరీర్లో నటించిన పాత్రలకు భిన్నమైన పాత్ర ఇందులో పోషించినట్లు చెప్పారు. ఇటువంటి పాత్ర తనతో చేయించినందుకు కృష్ణ వంశీకి కమలినీ కృతజ్ఞతలు తెలిపారు.
**