ఏ ఒక్కరిని టెర్రరిస్ట్ అనలేదు: జాన్ అబ్రహం

5 Aug, 2013 22:32 IST|Sakshi
ఏ ఒక్కరిని టెర్రరిస్ట్ అనలేదు: జాన్ అబ్రహం

'మద్రాస్ కేఫ్' చిత్రంలో తాము ఏ ఒక్కరిని టెర్రరిస్ట్ గా  చిత్రీకరించలేదని బాలీవుడ్ నటుడు, నిర్మాత జాన్ అబ్రహం వివరణ ఇచ్చారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్ టీ టీఈ) గ్రూప్ ను టెర్రరిస్టులుగా చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలకు జాన్ అబ్రహం వివరణ ఇచ్చారు. 'తాము ఎవ్వరిని కూడా నొప్పించలేదు.  ఎవరికి అనుకూలంగా వ్యవహరించలేదు. మద్రాస్ కేఫ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారికి చిత్రాన్ని చూపిస్తాం' అని జాన్ తెలిపాడు.

వాస్తవ పరిస్థితులు, నిజాల ఆధారంగానే మద్రాస్ కేఫ్ ను రూపొందించాం అని అన్నాడు. ఎల్టీటీఈ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చిత్రాన్ని రూపొందించారనే ఆరోపణలతో 'మద్రాస్ కేఫ్'ను నిషేధించాలని తమిళ సంస్థ నామ్ తమీజార్ వ్యవస్థాపకుడు సీమాన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో జాన్ అబ్రహం స్పందించారు.

ఆగస్టు 23న విడుదలవుతున్న ఈ చిత్రంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి 'మద్రాస్ కేఫ్' ను చూపించడానికి  సిద్ధంగా ఉన్నామని.. అయినా.. ఈ చిత్రాన్ని రాజకీయ లబ్దికి ఉపయోగించుకోవాలని చూస్తే.. దానికి తాను ఏమి చేయలేనని ఆయన అన్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన మద్రాస్ కేఫ్ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాన్ అబ్రహం పాల్గొన్నాడు.