దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడే

18 May, 2019 07:42 IST|Sakshi
మహేశ్‌బాబును సత్కరిస్తున్న మంత్రి మల్లారెడ్డి

‘మహర్షి’ సక్సెస్‌ మీట్‌లో మహేష్‌బాబు  

సీఎంఆర్‌లో చిత్రం సక్సెస్‌ మీట్‌

మేడ్చల్‌రూరల్‌: ‘మహర్షి’ మహేష్‌బాబు శుక్రవారం కండ్లకోయలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడి సీఎంఆర్‌ విద్యా సంస్థల ఆడిటోరియంలో చిత్రం సక్సెస్‌ మీట్‌ను విద్యార్థులతో ఏర్పాటు చేశారు. చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి కలిసి పాల్గొన్న ప్రిన్స్‌.. విద్యార్థులతో సినిమా విజయాన్ని పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు హీరో, దర్శకులు సమాధానాలిచ్చారు. మహేష్‌బాబు తన చదువు, సినిమాలు, రియల్‌ లైఫ్‌ గురించి ఎన్నో విశేషాలను వివరించారు. మన సంస్కృతి వ్యవసాయమని, దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడేనన్నారు. సెలవులు లేకుండా కష్టపడేది వీరిద్దరేనని, వారికి కావల్సింది సానుభూతి కాదని గౌరవమని  మహేష్‌ పేర్కొన్నారు. ‘మహర్షి’ సినిమాలో ‘తాతా నాకు వ్యవసాయం నేర్పుతావా’ అన్న డైలాగ్‌ ప్రతీ ఒక్కరిని కదిలించిందని, దానికి కారణం మన కుటుంబాలు వ్యవసాయంతో ముడిపడి ఉండటమేనన్నారు.

వంశీ ‘మహర్షి’ సినిమా తనతో చేయడానికి తన రెండు సినిమాలు పూర్తయ్యే వరకు వేచి ఉన్నాడని వివరించారు. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో మహర్షిలోని ‘రిషి’ పాత్ర ఎంతో గొప్పదిగా భావిస్తున్నాన్నారు. ఒక కంపెనీ సీఈఓ అయితే మీరు ఉద్యోగుల కోసం ఏం చేస్తారని ఓ విద్యార్థి అడగ్గా.. తనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడం తప్ప  ఏమీ తెలియదని సమాధానమిచ్చారు. తన చదువు మొత్తం చెన్నైలో సాగిందని, అందుకే తనకు ఇక్కడ ఎక్కువ మంది మిత్రులు లేరని, తనకు మంచి మిత్రుడు వంశీ పైడిపల్లి అని మరో విద్యార్థి ప్రశ్నకు సమాధానంమిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మహేశ్‌బాబును సత్కరించారు. కార్యక్రమంలో సీఎంఆర్‌ విద్యా సంస్థల కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు