ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌గా మనోజ్‌.. నిజమేనా!

8 Jul, 2020 15:18 IST|Sakshi

గత కొన్ని రోజులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ 30వ సినిమాలో మంచు మనోజ్‌ నటించబోతున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాటల మాత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, జూ.ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని త్రివిక్రమ్‌ ఫిబ్రవరిలో ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకుముందు ‘అరవింద సమేత వీర రాఘవా’ సినిమాకు కలిసి పనిచేశారు. ప్రస్తుతానికి ‘ఎన్టీఆర్‌ 30’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో మనోజ్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడని ఇటీవల వార్తలు వినిపించాయి. సినిమాలోని కీలక పాత్ర కోసం త్రివిక్రమ్‌ మనోజ్‌ను సంప్రదించడం దీనికి మనోజ్‌ ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని వినికిడి. (జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌)

అయితే ప్రస్తుతం వీటన్నింటికి  ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈ వార్తలపై మనోజ్‌ స్పందించాడు. తనకు ఎన్టీఆర్‌ సినిమా నుంచి ఎలాంటి ఆఫర్‌ రాలేదని స్పష్టం చేశారు. ఈ సినిమాలో తను నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తను నటిస్తున్న సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పట్లో వేరే ప్రాజెక్టు ఏదీ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. కాగా అయిదు భాషల్లో విడుదలవుతున్న అహం బ్రహ్మాస్మి మూవీని శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. (ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనోజ్‌)

మరోవైపు ఎన్టీఆర్‌ 30 సినిమాలో అక్కినేని సమంత నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కనుక నిజమైతే ఎన్టీఆర్‌ సమంత కలిసి చేస్తున్న అయిదవ సినిమా అవుతుంది. ఇప్పటి వరకు బృందావనం, రామయ్య వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజీ సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు