ఆత్మహత్య చేసుకోవాలనిపించింది

3 Feb, 2019 03:33 IST|Sakshi
జయప్రద

‘‘లైంగిక వేధింపులను ఎదుర్కొన్న బాధితులకు మాత్రమే ఆ బాధ తెలుసు. ఎందుకంటే వాళ్లు భరించారు కాబట్టి. వాళ్లందరికీ నా సానుభూతి ఉంటుంది. ధైర్యంగా బయటకు వచ్చి ఆ విషయాన్ని చెప్పడం అభినందనీయం. అదే విధంగా చాలా చోట్ల ‘మీటూ’ను తప్పుగా ఉపయోగిస్తున్నారు’’ అని జయప్రద పేర్కొన్నారు. ఇటీవల ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జయప్రద తన లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు.

► ‘‘మీటూ’ ఆరోపణల నిర్ధారణకు త్రీ బెంచ్‌ (ముగ్గురి కంటే ఎక్కువ న్యాయ నిర్ణేతలు న్యాయ విచారాన్ని జరిపించడం)  విధానాన్ని పాటించాలి. ఆ విధానం ద్వారా తప్పొప్పులను, నిజానిజాలను కనుక్కోవచ్చు. అలా చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నాను.


► మన పురుషాధిక్య సమాజంలో రాజకీయ నాయకురాలిగా నిలబడటమంటే యుద్ధం చేయడమన్నట్టే. యంపీగా ఉన్నప్పటికీ నామీద యాసిడ్‌ అటాక్‌ చేస్తామంటూ రాజకీయ నాయకులు ఆజమ్‌ ఖాన్‌ బెదిరించేవారు. బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి తిరిగొస్తానో లేదో తెలియదు. మరుసటిరోజు బతికుంటానో లేదో కూడా డౌట్‌గానే ఉండేది.

► ఆ మధ్య నావి మార్ఫింగ్‌ చేసిన కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఆ సమయంలో నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కుడా వచ్చాయి. నాకు బ్రతకాలని అనిపించలేదు. అలాంటి కఠినమైన సందర్భాల్లో కూడా నాకెవ్వరూ సపోర్ట్‌ చేయలేదు. కేవలం అమర్‌ సింగ్‌ జీ మాత్రమే నాతో నిలబడ్డారు. ఆయన్ను నా గాడ్‌ ఫాదర్‌లా భావిస్తాను. అలాంటి సమయంలో సహాయంగా నిలబడ్డవాళ్లను అలానే భావిస్తాం కదా. మా గురించి ఏదేదో మాట్లాడుకునేవాళ్లు ఒకవేళ ఆయనకు నేను రాఖీ కట్టినప్పటికీ ఊరుకుంటారని నేననుకోను.

► ఆటోబయోగ్రఫీ రాసేంత ధైర్యం లేదనుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా ఏదో నేర్చుకుంటూనే ఉన్నానని భావిస్తాను. ఆటోబయోగ్రఫీ రాయాలంటే ఇంకా చాలా సాధించాలి. నా అచీవ్‌మెంట్స్‌ నాకు గుర్తు లేవు. నా లైఫ్‌లో అన్ని అడ్డంకులు తొలగిపోయాయని భావించిన రోజు రాస్తాను.

మరిన్ని వార్తలు