విడాకులపై చర్చించే ‘ఓ మై కడవులే’

2 Feb, 2020 09:18 IST|Sakshi

ప్రేమ, పెళ్లి, విడాకులు అంశాలను చర్చించే విభిన్న కథా చిత్రంగా ఓ మై కడవులే చిత్రం ఉంటుందని ఆ చిత్ర నిర్మాత ఢిల్లీబాబు చెప్పారు. ఇంతకుముందు రాక్షసన్‌ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన తన యాక్సెస్‌ ఫిలిం ఫ్యాకర్టీ పతాకంపై తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఓ మై కడవులే. అశోక్‌ సెల్వన్, అభినయ సెల్వన్‌ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా అశ్వత్‌ మారిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన నాళైయ ఇయక్కునార్‌ సీజన్‌ 3 నుంచి వచ్చారన్నది గమనార్హం. ఇంతకు ముందు కొన్ని లఘు చిత్రాలను రూపొందించారు. ఓ మై కడవులే చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి ముఖ్యమైన పాత్రలో నటించగా, అశోక్‌సెల్వన్, రితికా సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలో నటి వాణీబోజన్‌ నటించింది. ఈమె బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమవుతోంది. దర్శకుడు గౌతమ్‌మీనన్‌ కీలక పాత్రలో నటించడం మరో విశేషం. 

నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఓ మై కడవులే చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర దర్శక, నిర్మాతలు శనివారం మీడియాతో మాట్లాడుతూ నిర్మాత ఢిల్లీబాబు మాట్లాడుతూ రాక్షసన్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం తరువాత తమ సంస్థలో నిర్మిస్తున్న చిత్రం ఓ మై కడవులే అని తెలిపారు. దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు చెప్పిన కథ నచ్చడంతో ఒకే ఒక్క గంటలోనే ఓకే చేశానని చెప్పారు. ప్రేమ, వినోదం వంటి యూనిక్‌ కథతో రూపొందించిన చిత్రం ఇదని తెలిపారు. ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే కథా చిత్రంగా ఉంటుందన్నారు. నటుడు విజయ్‌సేతుపతి ఇందులో చాలా ఇంపార్టెంట్‌ ఉన్న పాత్రలో నటించినట్లు చెప్పారు. తాను మంచి కంటెంట్‌ లేకపోతే చిత్రాలను చేయనన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సూర్య చేతుల మీదగా శుక్రవారం విడుదల చేశామని, ఒక్క గంటలోనే మిలియన్‌ ప్రేక్షకులు ట్రైలర్‌ను వీక్షించినట్లు తెలిపారు. 

ఈ చిత్ర కథపై 2013లోనే తనకు ఐడియా వచ్చిందన్నారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారని, అలాంటిది ఎన్నో పెళ్లిళ్లు విడాకులకు ఎందుకు దారి తీస్తున్నాయన్న ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఓ మై కడవులే అని చెప్పారు. ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటించడానికి రియల్‌లైఫ్, రీల్‌ లైప్‌ హీరో అవసరం అయ్యారని, నటుడు విజయ్‌సేతుపతిని ఆ పాత్రకు సంప్రదించగా, కథ విన్న ఆయన ఈ పాత్రనే తానే చేయాలని అన్నారని చెప్పారు. ఇవాళ సినిమాల్లో ఎక్స్‌ట్రార్డనరీ ఎలిమెంట్స్‌ ఉంటేనే గానీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు. ఈ చిత్రాన్ని అందరూ రిలేట్‌ చేసుకుంటారని చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్‌మీనన్‌ తన రియల్‌ పాత్రనే పోషిస్తున్నారని చెప్పారు. చిత్ర తమిళనాడు విడుదల హక్కులను శక్తిఫిలిం ఫ్యాక్టరీ శక్తివేల్‌ పొందారని, ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు.
 

మరిన్ని వార్తలు