ఇలాంటి రోడ్ ఫిల్మ్ తెలుగులో రాలేదు!

5 Oct, 2014 23:47 IST|Sakshi

 ‘‘స్వతహాగా నేను రచయితను. దర్శకుడు కావాలనే ఆకాంక్షతో సినిమా పరిశ్రమకు వచ్చాను. తొలి ప్రయత్నంగా ‘విలేజ్‌లో వినాయకుడు’, ఆ తర్వాత ‘కుదిరితే కప్పు కాపీ’ చిత్రాలు నిర్మించాను. ఆ చిత్రాలతో 24 శాఖలపై అవగాహన ఏర్పడింది. అందుకే ‘పాఠశాల’ చిత్రానికి దర్శకత్వం వహించాను’’ అని మహి వి. రాఘవ్ చెప్పారు. కాలేజీ ముగిసిన తర్వాత ఐదుగురు స్నేహితులు.. వారి వారి ఇంటికి తమ స్నేహితులను తీసుకెళ్లినప్పుడు ఎదురయ్యే సంఘటనల సమాహారంతో సాగే ‘పాఠశాల’ ఈ నెల 10న విడుదల కానుంది. మహి మాట్లాడుతూ - ‘‘పాఠశాల అనేది సంస్కృత పదం. పాఠ అంటే పాఠం.. శాల అంటే రహదారి అని అర్థం. తెలుగులో ఇలాంటి రోడ్ ఫిల్మ్ రాలేదు. ఈ చిత్రానికి కథే ప్రత్యేక ఆకర్షణ. తెలుగులో ‘హ్యాపీ డేస్’ తర్వాత స్నేహితుల నేపథ్యంలో వచ్చిన చిత్రం ఇదే. సరికొత్త అనుభూతికి గురిచేసే చిత్రం అవుతుంది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే, మరిన్ని మంచి చిత్రాలు తీయాలనే ప్రోత్సాహం కలుగుతుంది’’ అని చెప్పారు.