తెలుగులోకొచ్చిన లీలాధరుడు

14 Aug, 2014 22:04 IST|Sakshi
తెలుగులోకొచ్చిన లీలాధరుడు

అత్యుత్తమస్థాయి నటులు మాత్రమే చేయగలిగే పాత్రలు కొన్ని ఉంటాయి. అలాంటి పాత్రే... హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’లో మిథున్ చక్రవర్తి పోషించిన లీలాధర్ స్వామి పాత్ర. శారీరక కదలికల్లో ఓ విధమైన ఆడతనం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాడేమో అనిపించేంత ఆడంబరం కనిపిస్తుంది ఆ పాత్రలో. చూపులకు దైవత్వం, అంతర్లీనంగా కన్నింగ్ నేచర్, చిత్రమైన సంభాషణా చాతుర్యం... ఇన్ని ప్రత్యేకలుండే పాత్ర అది.
 
  ఆ పాత్రను మిథున్‌చక్రవర్తి అనితర సాధ్యంగా పోషించారంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అందుకే... ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్ ‘గోపాల గోపాలా’లో కూడా లీలాధర స్వామి పాత్రకు మిథున్ చక్రవర్తినే తీసుకున్నారు దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ). మాతృకలో పోషించిన పాత్రనే మళ్లీ చేయాలని అడగడంతో, అంగీకారం తెలుపడానికి కాస్త తటపటాయించారట మిథున్. కానీ చిత్ర యూనిట్ కమిట్‌మెంట్ చూసి, ఆ పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. వెంకటేశ్, పవన్‌కల్యాణ్ లాంటి సూపర్‌స్టార్‌లు కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో మిథున్‌చక్రవర్తిలాంటి నటి సూపర్‌స్టార్ తోడవ్వడంతో ‘గోపాల గోపాలా’కు మరింత శోభ చేకూరిందని చెప్పాలి.
 
  గురువారం మిథున్‌చక్రవర్తి ఈ సినిమా షూటింగ్‌లోకి ప్రవేశించారు. మిథున్ ఇందులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతారట. ఇందుకోసం తెలుగు భాషను శ్రద్ధగా నేర్చుకుంటున్నారాయన. సెట్‌లో కూడా అందరితో తెలుగులోనే మాట్లాడుతున్నారట. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రియ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ: భవేష్ మండాలియా, ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్,  సంగీతం: అనూప్ రూబెన్స్.