నిర్మాత పిలిచినా రాలేదు

16 Aug, 2014 00:20 IST|Sakshi
నిర్మాత పిలిచినా రాలేదు

తమిళ సినిమా : చిత్ర ప్రచారానికి నిర్మాత ఆహ్వానించినా నటి హన్సిక రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్య, హన్సిక జంటగా నటించిన చిత్రం మరియాన్ మిగమాన్. నెమిచంద్ జపక్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వి.హిదేశ్ జపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాగిళ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. తడయరతాక్క చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.

ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.సతీష్‌కుమార్ చాయాగ్రహణం నెరుపుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ గురువారం చెన్నైలో ఒక ఎఫ్‌ఎం రేడియో సంస్థ కార్యాలయంలో జరిగింది. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మగిళ్ తిరుమేణి మాట్లాడుతూ ఇది కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్న వైవిద్యభరిత కథా చిత్రం అని తెలిపారు.
 
నటుడు ఆర్యను దృష్టిలో పెట్టుకుని చిత్ర కథను తయారు చేయకున్నా ఆయన పాత్ర పోషణ చూసిన తరువాత మిగమాన్ చిత్రం హీరో పాత్రకు ఆర్యనే కరెక్ట్ అనిపించిందన్నారు. అదేవిధంగా హీరోయిన్ పాత్రకు నటి హన్సిక తన ఆలోచనలోనే లేదన్నారు. ముంబాయి నుంచి కొత్త హీరోయిన్‌ను పరిచయం చేద్దామనుకున్నానన్నారు. అయితే నిర్మాత హన్సికనే తమ చిత్ర హీరోయిన్ కావాలని, పట్టుబట్టి ఆమెతో మాట్లాడినట్లు చెప్పారన్నారు. దీంతో హన్సికను కలిసి కథ వినిపించగా మరో మాటలేకుండా వెంటనే తానీ చిత్రం చేస్తున్నానని చెప్పారన్నారు. ఆమె నటన ఈ చిత్రంలో ప్రశంసలందుకుంటుందన్నారు.
 
ఈ కార్యక్రమానికి హన్సిక రాలేదేమన్న విలేకర్ల ప్రశ్నకు ఆర్య కల్పించుకుని అలాంటి వ్యవహారాలన్నీ నిర్మాతనే చూసుకుంటున్నారని బదులిచ్చారు. నిర్మాత పిలిచినా ఆమె రాలేదని ఈ సారి తాను ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని నవ్వుతూ చెప్పారు.

>