ఒకే ఇంట్లో వేరు వేరుగా ఉన్నాం

16 Apr, 2020 03:46 IST|Sakshi
శ్రియ, ఆండ్రీ కొశ్చివ్‌

రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చివ్‌ను రెండేళ్ల క్రితం శ్రియ వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ దంపతులు స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంటున్నారు. కోవిడ్‌ 19 (కరోనా వైరస్‌) మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న ప్రపంచదేశాల్లో స్పెయిన్‌ ఒకటి. తన భర్త ఆండ్రూలో కోవిడ్‌ 19 లక్షణాలు కనిపించడంతో చాలా కంగారుపడ్డానని శ్రియ పేర్కొన్నారు. ఈ విషయం గురించి శ్రియ చెబుతూ– ‘‘పొడి దగ్గు, జ్వరంతో ఆండ్రీ బాధపడుతున్నాడని హాస్పిటల్‌కు వెళ్లాం. కానీ అక్కడి వైద్యులు మమ్మల్ని వెంటనే వెళ్లిపొమ్మన్నారు.

ఆండ్రీకు కరోనా లక్షణాలు లేవని, ఇక్కడే (హాస్పిటల్‌లో) ఉంటే నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి డాక్టర్స్‌ అన్నారు. దాంతో మేం వెంటనే ఇంటికి వచ్చేశాం. మా అంతట మేం ‘ఐసోలేషన్‌’లో ఉండిపోయాం. వేరే వేరు గదుల్లో ఉండటం మొదలుపెట్టాం. ఇంట్లో ఉండి ఆండ్రూ చికిత్స చేయించుకున్నాడు. తను కోలుకున్నాడు’’ అని పేర్కొన్నారు. ఇంకా అక్కడి పరిస్థితుల గురించి శ్రియ మాట్లాడుతూ – ‘‘మా వివాహ వార్షికోత్సవాన్ని  (ఈ నెల 13) సెలబ్రేట్‌ చేసుకోవడానికి మేం ఓ రెస్టారెంట్‌లో రిజర్వ్‌ చేయించుకున్నాం.

తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అది క్లోజ్‌ చేసి ఉంది. బయటి పరిస్థితులను చూసిన తర్వాత కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆండ్రూ తెల్లగా, నేను బ్రౌన్‌ కలర్‌లో ఉండటం వల్ల మేం ఒకే ఫ్యామిలీ కాదనుకుని విడిచిపెట్టారు. అంటే... నిత్యావసరాల కోసం కుటుంబం నుంచి ఒక్కరే బయటకు వెళ్లాలనేది రూల్‌. ఇలా చూస్తుండగానే మన చుట్టూ ఉన్న పరిస్థితులను కరోనా వైరస్‌ ఒక్కసారిగా ఎంత మార్చివేసిందో కదా అని మేమిద్దరం అనుకున్నాం’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు