ఆరోపణలు సరే.. ఆధారాలేవి..?

19 Dec, 2018 12:45 IST|Sakshi

మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీడియా, సిని, రాజకీయ రంగాల్లోని పలువురు ప్రముఖులు మీటూ దెబ్బకు ఠారెత్తిపోయారు. కలలో కూడా ఊహించని వారి పేర్లు తెరమీదకు వచ్చాయి. మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బాలీవుడ్‌ ఇండస్ట్రీ పక్కకు పెట్టింది. ఇలా నిషేధం ఎదుర్కొంటున్న వారిలో కంపోజర్‌ అను మాలిక్‌ కూడా ఉన్నారు. సింగర్స్‌ సోనా మొహపాత్రా, శ్వేతా పండిట్‌ అను మాలిక్‌ తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు. మరో ఇద్దరు మహిళలు కూడా అను మాలిక్‌ మీద ఇలాంటి ఆరోపణలే చేశారు. దాంతో బాలీవుడ్‌ అను మాలిక్‌ మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాజ్ఞలను గాయకుడు సోను నిగమ్‌ వ్యతిరేకించారు. ఇలా చేసి అతని కుటుంబాన్ని బాధిస్తున్నారని ఆరోపించారు.

అజెండా ఆజ్‌తక్‌తో మాట్లాడిన సోను నిగమ్‌, అను మాలిక్‌కు మద్దతిస్తూ.. ‘ఒక వేళ మీరు నాతో తప్పుగా ప్రవర్తించానని నేను ఆరోపిస్తే.. వెంటనే మీరు ఆధారాలేంటని అడుగుతారు. మరి అను మాలిక్‌ మీద ఆరోపణలు చేశారు. సరే​ ఇవి నిజమా, కాదా అనేది కూడా ఆలోచించకుండా జనాలు మిమ్మల్ని నమ్మారు. అలాంటప్పుడు సరైన ఆధారాలు చూపించాలి కదా. మరి ఆధారాలేవి? లేవు.  కానీ ఇవేం ఆలోచించకుండా అతని మీద నిషేధం విదించారు. ఇది కరెక్టెనా. అతనికి పని దొరక్కుండా చేయడం ఎంత వరకూ న్యాయం. అతని కుటుంబాన్ని ఎలా హింసిస్తారు’ అంటూ ప్రశ్నించారు. మరోకరి జీవితాల్లోని తప్పోప్పులను నిర్ణయించే హక్కు మీకు ఎరిచ్చారన్నారు. మీరు అతన్ని నిందించవచ్చు, అవమానించవచ్చు. కానీ అతని కుటుంబాన్ని శిక్షించకూడదు. ముందు ఆధారాలు తీసుకురండి అన్నారు.

సోను నిగమ్‌ మాట్లాడుతూ.. ‘అధికారం ఏ విధంగా దుర్వినియోగం అవుతోందో చెప్పడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు ‘మీటూ’ అంటున్నారు. కానీ పదేళ్ల క్రితమే నేను దీనిని ప్రారంభించాను. అప్పుడు ఒక జర్నలిస్ట్‌ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఓ దర్శకుని దగ్గరకు వెళ్లి నాతో పనిచేస్తే తనను తాను చంపుకుంటానని సదరు జర్నలిస్ట్‌ దర్శకున్ని బెదిరించాడు’ అంటూ తనకు ఎదురైన అనుభవాల్ని చెప్పుకొచ్చారు. అంతేకాక నాకు ఇద్దరు సోదరీమణులున్నారు. నేను వారికి అండగా నిలబడతాను. దాని అర్థం మరోకరికి పని దొరక్కుండా చేస్తానని కాదు అన్నారు. హింస, వేధింపు, ఎక్కడైనా ఉంటాయి. కార్పొరేట్‌ ప్రపంచంలో కూడా జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు