సినీ సంగీత ప్రపంచంలో.. మహానుభావులు ఎందరో

21 Jun, 2019 12:03 IST|Sakshi

సంగీతానికి రాళ్లు కరుగుగతాయంటారు.. రాళ్లేమో కానీ మన మనసును మాత్రం ఇట్టే కరుగుతుంది. సంగీతానికి ఉండే శక్తి అటువంటింది. మనిషి మూడ్‌ను మార్చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. మనసు బాగోలేకపోయినా.. మనకు ప్రశాంతత కరువైన నచ్చిన పాటలు వింటూ కొద్ది సేపు వింటే కిక్కే వేరప్ప. ఇక అందరికీ అన్ని పాటలు నచ్చకపోవచ్చు. కొందరికి మెలొడి సాంగ్స్‌, మరికొందరికి విప్లవ పాటలు, ఇంకొందరికి మాంచి ఫాస్ట్‌ బీట్ మాస్‌ సాంగ్‌లు అంటే ఇష్టం. 

అయితే.. కొన్ని పాటలు వింటూ ఉంటే లోకాన్ని మైమరిచిపోతూ ఉంటాం. మరికొన్నింటిని వింటే రక్తం ఉడికిపోయేలా ఉంటుంది. భారతీయ సంగీత శాస్త్రంలో ఉన్న గొప్పతనం మరెక్కడా లేదేమో అనిపిస్తుంది. అందులోనూ తెలుగు సాహిత్యంతో మెళవించిన సంగీతలోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. అలనాటి ఆపాతమధురాలు వింటూ ఉంటే.. ఆకాశయానం చేస్తున్నట్లు ఉంటుంది. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో మంది సంగీత విద్వాంసులు ఈ సంగీతపూదోటలో ఎన్నో రకాల పుష్పాలను, ఇంకెన్నో కొత్త రకాల ప్రక్రియలను సృష్టించారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి,థూ కొసరాజు, ఆత్రేయ, సాలూరి రాజేశ్వర్రావు, ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె, వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్‌ వారి సాహిత్యంతో పదాలు కొత్త పుంతలు తొక్కుతుంటే.. కెవి మహదేవన్‌, ఘంటసాల, రమేష్‌నాయుడు, చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి ఇలా ఆనాటి నుంచి నేటి వరకు ఈ సంగీత ప్రపంచాన్ని తమ సృజనతో ఎప్పటికప్పుడు మలుపులు తిప్పుతూనే ఉన్నారు. నాటి పాటలు వింటూ ఉంటే.. అవి ఎప్పటికీ చెరిగిపోవు అనేట్టు ఉంటాయి. ఇప్పటికి ఆ పాటలు ఈతరం నోటివెంట వస్తుంటాయంటేనే వాటి గొప్పదనం ఏంటో తెలుస్తోంది. 

పగలే వెన్నెల జగమే ఊయలా అంటూ ఘంటసాల సృష్టించిన పాట వింటూ ఉంటే నిజంగానే ఆ అనుభూతి కలుగుతుంది. రావోయి చందమామ ఈ వింత గాథ వినుమా.. అంటూ సావిత్రి, ఎన్టీఆర్‌లు పాడుకుంటూ ఉంటే తెలుగు ప్రేక్షకులు వారికి నీరాజనం పట్టారు. అంతా బ్రాంతియేనా.. దేవదాస్‌ చిత్రంలో పారు ఏడుస్తుంటే.. అందరీ కళ్లు చెమ్మగిల్లాయి. నా పాట నీ నోట పలకలా చిలకా.. అని నాగేశ్వర్రావు మూగమనుసులు సినిమాలో సావిత్రికి నేర్పిస్తుంటే.. ప్రేక్షకలోకం కూడా వంతపాడింది. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది అంటూ ఏఎన్నార్‌ పాడితే.. కుర్రలోకం మత్తులో మునిగిపోయింది. 

జానకీ కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు.. అంటూ జయసుధ, శోభన్‌ బాబు పాడుకున్న ఈ పాట తరాలు మారినా దానిలోని స్వచ్చత ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సందర్భానుసారంగా వచ్చే కొన్ని  పాటలు మనిషి జీవితంలో భాగమైపోయాయి. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఈ పెళ్లి తంతులో కొన్ని పాటలను ప్లే చేయాల్సిందే అన్నట్లు అదొక రివాజుగా మారింది. పెళ్లిపుస్తకం చిత్రంలోని శ్రీరస్తు.. శుభమస్తు, మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు అనే గీతాలు పెళ్లి మండపంలో మార్మోగాల్సిందే. ఇలా మనిషి పుట్టినప్పటి నుంచీ పోయేవరకు ఉండే ప్రతిఘట్టాన్ని పాటల రూపంలో మన చిత్రసీమ అందించింది.

ఒక్కపాట ఓ జాతి మొత్తాన్ని కదిలించింది అంటే.. అది ఎంతటిప్రభంజాన్ని సృష్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో నిద్రాణమై ఉన్న జాతిని మేల్కొలిపేందుకు తెలుగు వీర లేవరా.. అంటూ గొంతెత్తితే వెండితెర దద్దరిల్లింది. మళ్లీ ప్రేక్షకుల నాడీ వేగాన్ని, రక్తపు ప్రవాహవేగాన్ని పెంచిన పాటలెన్నో చిత్రప్రపంచంలో వచ్చాయి. అందులో అందరికీ సుపరిచితమైనవి, ఇప్పటికీ అవి అక్షరసత్యంగా నిలిచినవి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించినవవే. సిందూరంలో సినిమాలోని అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.., గాయం చిత్రంలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే రెండు పాటలు అప్పటి సమాజాన్నే కాదు ఇప్పటి సమాజాన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. 

బందాలు, బంధుత్వాలు, ప్రేమజంట, విరాహవేదన, ఇలా ప్రతీఒక్క అంశంపై ఎన్నో పాటలు, మనసుపై చెరగని ముద్ర వేసిన పాటలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మపై వచ్చిన పాటలన్నీ ప్రేక్షకుల మనసులో నాటుకుపోయాయి. ఏఆర్‌ రెహమాన్‌, కీరవాణి, కోటి, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్‌ లాంటి దిగ్గజాలు ఎన్నో మరుపురాని అద్భుతమైన పాటలు అందించగా.. యువ సంగీత దర్శకులు కూడా తమ సత్తా చాటుతూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సంగీతం, పాటలు అనే కాన్సెప్ట్‌ మహాసముద్రం లాంటింది. ఇలా పాటలు, సంగీతం గురించి చెప్పుకుంటూ, రాసుకుంటూ పోతే ఎప్పటికీ ఆది అంతం ఉండదు. ఈ సంగీత ప్రపంచంలో ఎన్నో కొత్త స్వరాలను ప్రేక్షకులకు అందించిన, ప్రస్తుతం అందిస్తున్న ఎంతో మంది సంగీత దర్శకులకు, పాటల రచయితలకు ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.

మరిన్ని వార్తలు