అందరికీ కనెక్ట్ అయ్యే దృశ్యకావ్యం

14 Mar, 2016 23:08 IST|Sakshi
అందరికీ కనెక్ట్ అయ్యే దృశ్యకావ్యం

‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 20 ఏళ్లు ఉద్యోగం చేశాను. చిన్నతనం నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా డెరైక్టర్ కావాలనే అభిలాష నా మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ ఇష్టాన్ని వదులుకోలేక ఇక్కడ రిస్క్ అని తెలిసినా సరే , సినిమాల్లోకి వచ్చా’’ అని దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘దృశ్యకావ్యం’ ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు....
 
సినిమా నిర్మాణం గురించి నాకంత అవగాహన లేదు. దర్శకత్వం గురించి కూడా అనుభవం లేదు. అందుకే ముందు నిర్మాతగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. శ్రీకాంత్, కామ్నా జెఠ్మలాని జంటగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే సినిమా నిర్మించాను. అప్పుడే ప్రొడక్షన్‌తో పాటు మిగతా విభాగాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆ అనుభవాలే ‘దృశ్యకావ్యం’ తీయడానికి ఉపయోగపడ్డాయి. ‘వీడికి దూకుడెక్కువ’ సినిమా తర్వాత దర్శకుడిగా నన్ను నేను పరీక్షించుకుందామని కథ కోసం అన్వేషిస్తున్న సమయంలో ఓ ఐడియా తట్టింది. ఆ స్క్రిప్ట్ వర్క్ కోసమే ఏడాది పాటు టైం తీసుకున్నాను. చాలా సింపుల్ స్టోరీ లైన్. నిత్య జీవితంలో మన కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలు.. తీవ్ర రూపం దాలిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది.
 
కథే హీరో!
దర్శకునిగా నాకిది తొలి సినిమా అని చెప్పాను. అందుకే, కథ నాకు బాగుందని అనిపించినా, ఇతరులు ఏమంటున్నారో తెలుసుకోవాలని, కొంతమందికి చెప్పాను. స్టోరీ లైన్ బాగుందని మెచ్చుకున్నారు. కానీ హీరో, హీరోయిన్లుగా కాస్త తెలిసిన వాళ్లయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అల్రెడీ తెలిసినవాళ్లే నటిస్తే... కథ ఎలివేట్ అవ్వదు. అదే, కొత్తవాళ్లు నటిస్తే, ఈ కథ వాళ్లకే జరుగుతున్న ఫీల్ చూసేవాళ్లకి కలుగుతుంది. అందుకే కొత్తవాళ్లతోనే తీయాలనుకున్నాను. కంటెంట్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నా దృష్టిలో ఈ సినిమాకి కథే హీరో. ఈ కథలో కనిపించే ముఖ్య తారలను చూసినప్పుడు ఫ్రెష్‌నెస్ కనిపించాలి. కార్తీక్, కశ్మీరలను హీరో, హీరోయిన్లుగా ఎన్నుకోవడానికి కారణం అదే. ఇద్దరూ అద్భుతంగా నటించారు.
 
ప్రీ-ప్రొడక్షన్‌కి ఏడాది!
ఏదో సినిమా తీశాంలే అని కాకుండా ఒక బలమైన ముద్ర పడే సినిమానే తీయాలనుకున్నాను. అందుకే ఏడాది పాటు ప్రీ-ప్రొడక్షన్‌కి కేటాయించాను. రెండు నెలల పాటు మా కెమెరామ్యాన్ సంతోష్‌తో కలిసి సినిమా ఎలా తీయాలి? అని చర్చించడంతో పాటు షాట్స్, టేకింగ్ మీద వర్క్‌షాప్ చేశాం. అది ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. నాలుగైదు నెలల్లోనే అనుకున్న విధంగా సినిమాని పూర్తి చేయగలిగాం.
 
వీనులవిందు... కనులకింపు
‘ప్రాణం’ ఫేమ్ కమలాకర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రాతో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి  ఆయువు పట్టు. ఆరు పాటలు, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. పాటలు వీనుల విందుగానే కాకుండా కనువిందుగా కూడా ఉంటాయి. కామెడీ కథానుసారంగానే సాగినట్లు పాటలు కూడా అలానే ఉంటాయి.
 
క్లైమాక్స్ ట్విస్టు ఎవరూ ఊహించలేరు!
ఈ కథలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.. తదుపరి ఏం జరుగుతుందో ఊహించలేరు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌ని. నాకు తెలిసినవాళ్ల దగ్గర క్లైమ్యాక్స్ చెప్పకుండా మిగతా కథ చెప్పాను. క్లైమ్యాక్స్ ఏంటని అడిగితే.. అందరూ రకరకాలుగా చెప్పారు. కానీ, ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్‌ని ఎవరూ ఊహించలేకపోయారు. ‘దృశ్యకావ్యం’కి అదో ప్లస్ పాయింట్.
 
కథనే నమ్ముకున్నా!
‘దృశ్యకావ్యం’ రిలీజ్ దగ్గర పడుతున్నా, నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే కథపై ఉన్న గ్రిప్ అలాంటి ది. నా వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. కష్టపడితే కచ్చితంగా ఫలితం దక్కుతుందన్న నమ్మకం ఉంది. నేనే కాకుండా మా టీమ్ మెంబర్స్ అందరూ ఈ సినిమాను ఓన్ చేసుకుని చేశారు. అందుకే క్వాలిటీ ఔట్‌పుట్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని 200 సెంటర్లలో విడుదల చేస్తున్నాం. ఢిల్లీ, ముంబై, కోలకతాలలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
 
అలా అనుకుంటే నేనిక్కడికి వచ్చేవాణ్ణే కాదు!
కథలో ఉన్న పొటెన్షియాలిటీని బట్టి ఏ నిర్మాతైనా ఖర్చు పెట్టాలి. పేపర్ మీద ఎయిర్‌పోర్ట్ అని రాసుకుంటే ఆ సన్నివేశాన్ని అక్కడే తీయాలి. రాజీపడి పోయి వేరే ఎక్కడో తీస్తే సీన్ పేలవంగా ఉంటుంది. కాఫీ డేలో తీయాల్సిన సన్నివేశాలు అక్కడే తీయాలి. అలాగే, కాకా హోటల్స్‌లో తీయాల్సిన సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలి. ఏదైనా సీన్ డిమాండ్ మేరకే చేయాలి. అందుకే అనవసరంగా ఖర్చుపెట్టకూడదు.. అలాగని పెట్టాల్సిన చోట రాజీపడకూడదు. అలా రాజీపడాలనుకుంటే నేనిక్కడకు వచ్చి ఉండేవాణ్ణి కాదు. ఓ నిర్మాతగా ఎక్కడ ఏం కావాలో, ఎక్కడ అక్కర్లేదో ముందు తెలుసుకోవాలి.

నాకా విషయం మీద పూర్తి అవగాహన వచ్చేసింది. అలాగే, ఓ దర్శకునిగా ఏమేం చేయాలో తెలుసుకున్నాను. ఇకనుంచి సినిమా పరిశ్రమలోనే కొనసాగుతా. ఓ మంచి కథ ఉంది. ‘దృశ్యకావ్యం’ కథకు పూర్తి భిన్నమైన కథ అది. ఆ చిత్రవిశేషాలు త్వరలోనే చెబుతాను. ఇప్పుడు నేను ప్రేక్షకులకు కోరుకునేది ఒక్కటే. ఒక మంచి సినిమా తీయడానికి మా వంతు కృషి చేశాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఓ ప్రేక్షకుడిలా ఈ సినిమా తీశాను చిన్నతనం నుంచి నేను చాలా సినిమాలు చూశాను.

ముఖ్యంగా కె.రాఘవేంద్రరావు, కె.బాలచందర్ సినిమాలంటే చాలా ఇష్టం. నా స్టోరీని ఓ డెరైక్టర్‌గా కాకుండా ఓ ప్రేక్షకునిగా చూశా. అందుకే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా టేకింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నా. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా ఉండవు. కామెడీ పేరుతో ద్వంద్వార్థ సంభాషణలు పెట్టలేదు. నందు అనే అప్‌కమింగ్ రైటర్‌తో కలిసి ఈ చిత్రానికి సంభాషణలు రాశాను. అందరూ చక్కగా చూసి హాయిగా  ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఎ, బి, సి అనే సెంటర్లు తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
 
కడుపుబ్బా నవ్వించే కామెడీ
టైటిల్ ‘దృశ్యకావ్యం’ అని పెట్టి ట్రైలర్స్, పోస్టర్స్‌లో భయపెడుతున్నావేంటి? అని చాలా మంది అడుగుతున్నారు. అయినా సినిమా అంతా భయపెట్టే అంశాలు ఉండవు. ఓ ఇంజినీరింగ్ కాలేజి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ ఇది. ఈ సినిమా ప్రథమార్ధం అంతా మంచి లవ్‌స్టోరీతో, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్రల కామెడీతో హాయిగా సాగుతుంది. ఇంగ్లిషు కూడా సరిగ్గా రాకుండా డొనేషన్లు కట్టి ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యే ‘జబర్దస్’్త బ్యాచ్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సినిమా ఊహించని మలుపు తిరుగుతుంది.